సినిమాల మీద అపారమైన జ్నానం, నిర్మాణ దశలో ఉండగానే.. ఆ సినిమాల భవిష్యత్తు చెప్పగల విజ్నానం ఆయన ప్రత్యేకతలు. ఒక సినిమాను కమర్షియల్ గా ఎలా తెరకెక్కించాలి? ఒక స్టార్ హీరో ఇమేజ్ ను ఇన్నోవేటివ్ గా ఎలా ఎలివేట్ చేయాలని అనే విషయాలు ఆయనకు కొట్టిన పిండి. చాలా చిన్నవయసులోనే డిస్ట్రిబ్యూటర్ గానూ, నిర్మాతగానూ మారిన ఆ టాలెంటెడ్ డైరెక్టర్ వై.వి.యస్. చౌదరి. దర్శకేంద్రుడి ప్రియ శిష్యుడిగా ఇండస్ట్రీలో మంచి పేరున్న చౌదరి.. ఇప్పుడు అగ్ర స్థానంలో ఉన్న రామ్, సాయిధరమ్ , ఇలియానా తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడిగా విశేషాన్ని సంతరించుకున్నారు. అలాగే… 48 ఏళ్ళ వయసులో కూడా  నందమూరి హరికృష్ణను హీరోని చేసి ‘సీతయ్య’ చిత్రం తెరకెక్కించి కమర్షియల్ హిట్టు కొట్టిన  ఘటికుడు వై.వి.యస్. చౌదరి.

చిన్నప్పటినుంచి యన్టీఆర్ ను ఆరాధించే వైవియస్ .. బాలయ్య ..పట్టాభిషేకం సినిమాతో కె. రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్ గా చేరారు. ఆ తర్వాత  ‘కలియుగ పాండవులు, సాహస సామ్రాట్, అగ్ని పుత్రుడు, దొంగ రాముడు, జానకిరాముడు, రుద్రనేత్ర, జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి సినిమాలకు పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలు చేస్తున్నప్పుడే ఆయన ప్రతిభను గుర్తించిన నాగార్జున .. తన సొంత నిర్మాణ సంస్థ అయిన గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ లో సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే సినిమాకు దర్శకుడిగా తొలి అవకాశమిచ్చారు. ఆ సినిమా మంచి హిట్టవ్వడంతో ..  ఆ తర్వాత తనే హీరోగా సీతారామరాజు తెరకెక్కించే అవకాశమిచ్చారు నాగ్. ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత మహేశ్ తో యువరాజు తెరకెక్కించారు. ఆ సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది. ఇక దాని తర్వాత బొమ్మరిల్లు సంస్థ ప్రారంభించి.. లాహిరి లాహిరి లాహిరిలో అనే మూవీ తెరకెక్కించారు చౌదరి. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత సీతయ్య, దేవదాస్, ఒక్కమగాడు, సలీమ్, నిప్పు, రేయ్ లాంటి చిత్రాలను తెరకెక్కించారు వైవియస్ చౌదరి. తన కెరీర్ లో మొత్తం 10 చిత్రాల్ని తెరకెక్కించిన వైవియస్ చౌదరి.. తన గురువు రాఘవేంద్రరావు లాగానే.. కమర్షియల్ చిత్రాలకు కొత్త అర్ధం చెప్పారు. నేడు వైవియస్ చౌదరి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!