ఆయన పాటకు చైత్రము కుసుమాంజలి పడుతుంది. ఆయన శైలి వెన్నెల్లో గోదారి అంతటి అందంగా ఉంటుంది. ఆయన భావం రొదలా మన ఎదలో తుమ్మెదలా చేసే కావ్యాలాపనలా వినిపిస్తుంది. ఆయన పదాల కూర్పు.. వెన్నెల పైట వేసిన కిన్నెరసానిని తలపిస్తుంది. పాటలో ఆయన ఒకో పదం .. స్వరాల సంపదే అనిపిస్తుంది. ఆయన అసలు పేరు పాటల సిరి. ఇంటిపేరు వేటూరి. ఆయన పాట రాస్తే .. పదాల పెదాలపై పుంభావాల నవ్వు విరబూస్తుంది. కలం కలకాలం ఆయన వేలికొసలకే ఉండిపోవాలని తపిస్తుంది. కాగితం అక్షరాల మాల గట్టి ఆయన మెడలో అలంకరించి మురిసిపోతుంది. తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఆయనది ఒక చరిత్ర. ఆయన చేసిన గీత సేద్యం.. సాహిత్య సరస్వతికి నైవేద్యం.
మాస్ మనసులో తన పాటను ఆరేసుకోబోయి పదికాలాల పాటు నిలిచేలా తన ఖ్యాతిని పారేసుకున్నారు. క్లాస్ హృదయాల్లో తన సాహిత్య సేవ తరతరాలకు అది నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ అని చాటిచెప్పారు. సాహిత్య విలువలు కలిగిన వైవిధ్యభరితమైన గీతాలెన్నిటినో మనకందించి అందరిమదిలో పాటై నిలచిపోయిన గీతర్షి వేటూరి సుందరరాముడు. 18 ఏళ్ల ప్రాయంలోనే కలం పట్టుకుని పత్రికా రంగంలో ప్రవేశించారు వేటూరి. ఈయన కలం నుంచి జాలువారి, ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిన ‘సిరికాకుళం చిన్నది’ గేయ రూపకాన్ని సినీ దర్శకుడు విశ్వనాథ్ విని, తొలిసారిగా ‘ఓ సీత కథ’ చిత్రంలో వేటూరికి అవకాశం కల్పించారు. నాటి నుంచి వేటూరి సినీ వినీలాకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈయన మది నిండా భావాలే. ఈయన పెదవి విప్పితే మాట పాటై ఎదుట నిలుస్తుంది. ఈయన కలానికి పదునూ, వేగం రెండూ ఎక్కువే. అందుకే ఆయన 1974 నుంచి 1800 తెలుగు సినిమాలకు ఆరు వేల పాటలను అందించి, తనదైన ఇజాన్ని సృష్టించుకున్నారు. నంది సహా ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. వేణువై ఈ భువనానికి వచ్చి అందరి హృదయాల్లో చెరిగిపోని పాటలు రాసేసి భావ సుగంధాలు వెదజల్లి.. గాలిగా మారి గగనానికి వెళ్ళిపోయాడు మన సాహిత్య సుందరరాముడు. నేడు వేటూరి వర్ధంతి . ఈ సందర్భంగా ఆ సరస్వతీ పుత్రుడికి అక్షర నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్. ‘