అక్షరం ఆయన లక్షణం.. కవిత్వం ఆయన నైజం. ప్రతీ పదంలోనూ భావ పరిమళాలు వెదజల్లడం ఆయన మనస్తత్వం. పాటల హారంలో ఆణిముత్యాల్లాంటి పదాలు పేర్చడం ఆయన ప్రతిభ. విధాత తలపున ప్రభవించిన అనాది జీవన వేదం ఆయన గీతం. కనుల కొలను లో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఆయన గీతా సారం. పేరు సీతారామశాస్త్రి. ఇంటిపేరు సిరివెన్నెల. కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు.. ఆయన . ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. అప్పటి సినీ సంగీత ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే ఉంది. ‘సరస స్వర సుర ఝరీ గమనమైన’ ప్రయాణం ఆయనది. ఆయన తన  పాటలతో ప్రశ్నించారు, జోల పాడారు, మేల్కొలిపారు. సంక్లిష్టమైన సన్నివేశానికి సైతం… అందమైన, అర్థవంతమైన పదాలతో, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించారు. అందుకే ఆయన్ని ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. తన తొలి చిత్రం పేరు ‘సిరివెన్నెల’నే, తన ఇంటి పేరుగా మార్చుకొన్న సీతారామశాస్త్రి.

1985లో కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ చిత్రంతో సీతారామశాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే తెలుగు సినిమా రంగంపై ప్రభావం చూపించారు. ఆ తర్వాత ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘స్వర్ణకమలం’, ‘శృతిలయలు’, ‘శివ’, ‘క్షణక్షణం’, ‘గాయం’, ‘గులాబి’, ‘మనీ’, ‘శుభలగ్నం’… ఇలా ఎన్నో చిత్రాల్లో గీతాలు రాశారు. తరాలు మారుతున్నా సరే… సీతారామశాస్త్రి కలం మాత్రం శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. సినిమాకీ, అందులో సందర్భానికి తగ్గట్టే కాకుండా… సమాజాన్ని కూడా ప్రతిబింబించేలా పాట రాయడం సిరివెన్నెల ప్రత్యేకత. ఆయన ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది పురస్కారాలు పది సార్లు అందుకొన్నారు. ఈ రోజు సిరివెన్నెల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ పుంభావ సరస్వతికి శుభాకాంక్షలు అందిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!