చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే, అరెరె అరెరె మనసే జారే, ఎందుకో ఏమో , నేను నువ్వంటూ, రూబా రూబా, చిలిపిగ చూస్తావలా, నే పడిపోయా పడిపోయా , కలలను తాకే ఓ కల , ఏమనిషికే మజిలీయో’ .. లాంటి ప్రేమ యూత్ ఫుల్ సాంగ్స్ ను  అలవోక గా రాసేసి.. తనకంటూ.. ఒక బాణీని ఏర్పరుచుకున్నాడు ఆయన. ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాలకు క్యాచీ పల్లవులతో పాటలు రాయడంలో చెయితిరిగిన గీతకారుడు ఆయన. కలం పేరు వనమాలి. ఆయన అసలు పేరు మణిగోపాల్ కృష్ణ అవల్దార్. పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత గీత రచయితగా మారారు. ప్రస్తుతం మాటల రచయితగా కూడా పలు చిత్రాలకి పనిచేస్తున్నారు.

చిత్తూరు సమీపంలోని మురుకంబట్టు గ్రామం వనమాలి స్వస్థలం. కడప, కదిరి పట్టణాల్లో హైస్కూలు చదువు సాగింది. చిత్తూరు పట్టణంలో ఇంటర్, డిగ్రీ పూర్తయ్యాయి. చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు సాహిత్యం చదివారు. ఎం.ఏలో యూనివర్సిటీ ర్యాంకుతో పాటు గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించారు. తదనంతరం ప్రముఖ రచయిత నూతలపాటి గంగాధరం సాహిత్యం మీద మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ తెలుగు శాఖలో పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు గాను మద్రాసు విశ్వవిద్యాలయం పి.హెచ్‌.డి. పట్టా ప్రదానం చేసింది. సినీ పాత్రికేయుడిగా పనిచేసిన వనమాలి ‘టైమ్‌’ చిత్రంతో గీత రచయితగా మారారు. ‘శివపుతుడ్రు’లోని చిరుగాలి వీచెనే… పాటతో ఆయనకి మరింత పేరొచ్చింది. అవకాశాలు వెల్లువెత్తింది మాత్రం… ‘హ్యాపీడేస్‌’ విజయంతోనే! ఏ.ఆర్‌.రెహ్మాన్‌ నుంచి ఇళయరాజా, హ్యారిస్‌ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మ, తమన్, కె.ఎమ్‌.రాధాకృష్ణన్, అనూప్‌ రూబెన్స్, విద్యాసాగర్, యువన్‌ శంకర్‌ రాజా, గోపీ సుందర్‌.. ఇలా ప్రతి ఒక్కరితోనూ పనిచేసే అవకాశం కలిగింది. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలు, కె.జె.యేసుదాస్‌ వంటి గొప్ప గొప్ప నాయకుల గొంతుల్లో అతడి  పాటలు పల్లవించడం అతడికి  దక్కిన అరుదైన గౌరవం! తెలుగులో అగ్ర దర్శకులతో పాటూ తమిళంలో మణిరత్నం, శంకర్‌ వంటి వారితోనూ, అలాగే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన అత్యధిక చిత్రాలకు పాటలు రాయడం కూడా గీతరచయితగా వనమాలి  అదృష్టం! ఒకప్పుడు కేవలం ఒకే ఒక్క పాట బాలు పాడితే చాలు, అదే వెయ్యి పాటల పెట్టుగా భావించిన నేను, ఇవాళ నిజంగా వేయి పాటలకు చేరువలో ఉండడం ఊహించని పరిణామం’’ అంటారు వనమాలి.  ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గేయ రచయితగా రెండు నంది అవార్డులు. బెస్ట్‌ లిరిసిస్ట్‌గా ఫిలిం ఫేర్‌ అవార్డు. మరో మూడుసార్లు ఫిలిం ఫేర్‌ అవార్డ్‌ నామినీగా ఎంపికయ్యారు వనమాలి.  సినీ గోయర్స్‌ అవార్డుతోపాటు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి ద్వారా ఉత్తమ జాతీయ కవిగా పురస్కారం అందుకున్నారు ఆయన . నేడు వనమాలి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ పాటల తోటమాలికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!