అల్లరి నరేశ్ సినీ కెరీర్ లో ది బెస్ట్ కామెడీ చిత్రం ‘సరదాగా కాసేపు’. టాలీవుడ్ లో ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ తీసిన బ్రిలియంట్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తొలిసారిగా అల్లరి నరేశ్ నటించిన ఈ సినిమాను శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై యం.యల్. పద్మకుమార్ చౌదరి నిర్మించారు. .. సెప్టెంబర్ 17, 2010న విడుదలై ఘన విజయం సాధించింది. శ్రీనివాస్ అనే ధనిక యువకుడు తన పెళ్ళిచూపులకు అతడి కార్ డ్రైవర్ అయిన రంగబాబు ను వెంటబెట్టుకు వెళతాడు. అయితే ఆ అమ్మాయిని సర్ ప్రైజ్ చేసే ఉద్దేశంతో ఒకరికొకరు వేషాలు మార్చుకుంటారు. ఆ విషయం ఆ అమ్మాయి తండ్రికి తెలుస్తుంది. ఇంతలో అనుకోకుండా జరిగిన పరిణామంతో మళ్ళీ ఎవరివేషం వారు వేసుకుంటారు. పెళ్ళిచూపులు మొదలవుతాయి. అక్కడనుంచి సాగే కొన్ని సంఘటనలతో హిలేరియస్ కామెడీ వర్కవుట్ అవుతుంది. వంశీ తన ట్రేడ్ మార్క్ కామెడీ పనితనాన్ని ప్రతీ సీన్ లోనూ, ప్రతీ షాట్ లోనూ ఆవిష్కరించాడు. అల్లరి నరేశ్ కార్ డ్రైవర్ గా కామెడీ టైమింగ్ తో అదరగొట్టగా.. ధనిక యువకుడిగా శ్రీనివాస్ అవసరాల తనదైన స్థాయిలో నటించి మెప్పించారు. మధురిమ హీరోయిన్ గా నటించిన ఇందులో ఇంకా.. ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, యం.యస్.నారాయణ, కొండవలస, నర్సింగ్ యాదవ్, ఝాన్సీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా 1986 లో మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మళపెయ్యున్ను మద్ధళం కొట్టున్ను’ అనే సినిమాకి రీమేక్ వెర్షన్. మోహన్ లాల్, శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మాలీవుడ్ లో ది బెస్ట్ కామెడీ చిత్రంగా నిలిచిపోయింది.