కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం.. పలానా దర్శకుడు అని టైటిల్ పడుతుంది. ఒక కథకు సీన్లు రాసుకొని, స్ర్కీన్ ప్లే రాసుకొని .. దాన్ని అద్భుతంగా తెరకెక్కించడం దర్శకుడి పని. అయితే ఆ పనిని తెరమీద నూటికి నూరు శాతం పెర్ఫెక్ట్ గా ఆవిష్కరించేందుకు తోడ్పడేవాడు కళా దర్శకుడు. ఒక సినిమాకు కథ ప్రకారంగా, అందులో సీన్స్ కు అనుగుణంగా, పాత్రలకు అనుగుణంగా.. పరిసరాలు, పరిస్థితులు, వాతావరణం అవన్నీ పక్కాగా కుదిరేలా చూసుకొనే బాధ్యత కళా దర్శకుడిదే. సెట్ ప్రాపర్టీస్ నుంచి.. హీరో, హీరోయిన్స్ తదితర నట వర్గం తాలూకు దుస్తులు డిజైన్ చేయడం కూడా కళా దర్శకుడి బాధ్యతే. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక కథాంశాలకు అనుగుణంగా.. వాతావరణాన్ని క్రియేట్ చేసే అతి పెద్ద బాధ్యత ఆయనది. అందులో ఆరితేరిన ఎందరో కళాదర్శకులు టాలీవుడ్ లో ఉండేవారు. అలాంటివారిలో కళాధర్ ఒకరు.
‘మాయాబజార్’, ‘పాతాళభైరవి’లాంటి పురాణ, జానపద చిత్రాలు పరిశీలిస్తే – పాత్రలు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు – అన్ని పాత్రోచితంగా కనిపిస్తాయి. అలా కనిపించడానికి కారణం – కళాదర్శకులు, కాస్ట్యూమర్సు. విజయ సంస్థ ఆరంభ కాలం నుంచి గోఖలే, కళాధర్ ఇద్దరూ కళా దర్శకులే. పాత్రలకీ, సెట్స్‌కీ, గోఖలే స్కెచెస్ గీస్తే – వాటికి ‘రూపం’ ఇవ్వడం – కళాధర్ బాధ్యత. అంతే కాదు దుస్తులు, ఆభరణాలు చూసుకోవడం కూడా ఆయన బాధ్యతే. విజయవారి తొలి చిత్రం ‘షావుకారు’ సాంఘికమే అయినా నేపథ్యాల్ని చూపించడంలో కళాదర్శకుల ప్రతిభ కనిపిస్తుంది. – అయితే, తరువాత వచ్చిన జానపదం ‘పాతాళభైరవి’ పెద్ద పరీక్ష! ఆ చిత్రాన్ని అన్ని విధాలా ‘అద్భుత చిత్రం’గా రూపొందించాలని అందరూ పట్టుబట్టారు. అంతవరకూ వచ్చిన జానపద చిత్రాలకు భిన్నంగా ‘పాతాళభైరవి’ రూపుదిద్దుకుందంటే అందుకు కారణం దర్శక నిర్మాతల దగ్గర్నుంచి అన్ని శాఖలూనూ. ఇందులో మాంత్రికుడి ఆహార్యం, దుస్తులూ; తోట రాముడి దుస్తులూ కొత్తగా కనిపిస్తాయి. కొత్తదనం కోసం పాటుపడిన కళాదర్శకుడు కళాధర్. గృహప్రవేశం’ చిత్రంతో కళాదర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరారు కళధర్ . తరువాత ‘మనదేశం’ చిత్రానికి పనిచేశారు. విజయవారు నెల జీతాల మీద నటుల్ని, టెక్నీషియన్లనీ తీసుకున్నప్పుడు కళాధర్‌నీ తీసుకున్నారు. గోఖలే, కళాధర్‌లు ఇద్దరూ ‘షావుకారు’ నుంచి, ‘ఉమా చండీగౌరీ శంకరుల కథ’ వరకూ – ఇరవై సంవత్సరాల పాటు ఆ సంస్థలో పనిచేశారు. డి.వి.యస్.వారి ‘గండికోట రహస్యం’ నుంచి కళాధర్ బయటి చిత్రాలకు పని చెయ్యడం ప్రారంభమైంది. దాదాపు 80 చిత్రాకు కళాధర్ పనిచేశారు. అందులో‘జీవనజ్యోతి’, ‘అల్లుడు పట్టిన భరతం’, ‘ముఝే ఇన్ సాఫ్ చాహీయే’, ‘జమిందారుగారి అమ్మాయి’, ‘పంతులమ్మ’, ‘నాలుగు స్తంభాలాట’, ‘ఇంటింటి రామాయణం’, ‘మహానగరంలో మాయగాడు’, ‘రుద్రతాండవం’, ‘ఓ సీత కథ’, ‘నిప్పులాంటి నిజం’, ‘రాజకోట రహస్యం’ చెప్పుకోదగ్గవి. నేడు కళాధర్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.