నవ్వించడం అంటే కామెడీ కాదు. కామెడీ చేయడం నవ్వినంత ఈజీ కాదు. అదొక ప్రత్యేకమైన శాస్త్రం. అందులో చాలా మంది పండితులై.. మనల్ని పడిపడినవ్వేట్టు చేశారు. అందులో ఓ ఆరితేరిన హాస్య పండితుడు బేతా సుధాకర్. చూడ్డానికి హీరోలా ఉంటాడు. ఆ ఒడ్డూ పొడుగూ.. అందం.. చందం.. భలేగా ఉంటాయి. మరి అలాంటి నటుడు .. టాలీవుడ్ లో కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ, హాస్యనటుడిగానూ స్థిరపడాల్సి ఎందుకు స్థిరపడాల్సి వచ్చింది? అంటే దానికి అనేక కారణాలు.
సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల లో జన్మించాడు. బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. ఏలూరు లో, గుంటూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు. ఆయన మెగాస్టార్ చిరంజీవి, హరిప్రసాద్, నారాయణమూర్తిలతో కలసి ఒకే గదిలో ఉండేవారు. వారంతా సినిమాల్లో వేషాల కోసం తెగతిరిగేవారు. అప్పటికి ఉప దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీరాజాను కలవడం ఆయన సుధాకరును ‘కిళుక్కుమ్ పోగుమ్ రైల్ (తూర్పువెళ్ళే రైలు) సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగిపోయాయి. ఆ క్రేజ్ తో దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. ప్రముఖ నటి రాధికతో అయితే ఏకంగా పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరుతెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది. తెలుగులో ఇతడి మొదటి చిత్రము సృష్టి రహస్యాలు. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు ఊరికిచ్చిన మాట, భోగి మంటలు. తొలినాళ్ళలో సుధాకర్.. హీరోగానూ, విలన్ గానూ నటించినా.. ఒక దశలో ఆయన తెలుగులో బిజీ కమెడియన్ అయిపోయారు. తనకు మాత్రమే సాధ్యమయ్యే కొన్ని మ్యానరిజమ్స్, విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో తెలుగు ప్రేక్షకుల్ని కొన్నేళ్ళపాటు నవ్వించారు. ఆ మధ్య కాస్తంత అనారోగ్యానికి గురై.. తిరిగి కోలుకున్న సుధాకర్.. ఇప్పుడు టాలీవుడ్ లో మళ్లీ నటించడానికి సిద్ధపడుతున్నారు. నేడు సుధాకర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ మంచి నటుడికి, చక్కటి హాస్యనటుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.