కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది అన్నీ తారుమారయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అధిక వ్యయంతో నిర్మించిన చిత్రాలు సైతం విడుదలకు నోచుకోలేదు. ఓటీటీ (ఓవర్ ది టాప్)లో విడుదల చేద్దామంటే చేసిన శ్రమకు ఫలితం దక్కదనే భావన కొందరిది. అందుకే ఎంత ఆలస్యమైనా కొన్ని చిత్ర బృందాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించేందుకు ఎదురుచూస్తున్నాయి. మరికొన్ని మాత్రం లాభాలు రాకపోయినా నష్టపోకుండా ఉంటే చాలని ఓటీటీ సంస్థల్ని సంప్రదిస్తున్నాయి. వాటితో ఒప్పందం చేసుకుని ఆన్‌లైన్లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాయి.
మహానటితో నేషనల్ అవార్డ్ కైవసం చేసుకున్న మల్లూ కుట్టి కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ చిత్రం జూన్ 19న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ గణిత శాస్త్ర మేథావి శకుంతలా దేవి బయోపిక్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న శకుంతలా దేవి చిత్రం కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో టైటిల్ రోల్ ను బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ పోషిస్తోంది. అమితాబ్ నటించిన బాలీవుడ్ చిత్రం గులాబో సితాబో వచ్చేనెలలో స్ట్రీమింగ్ కానుంది. ఇక లా, ఫ్రెంచ్ బిర్యానీ కన్నడ చిత్రాలు, జ్యోతిక నటించిన పొన్ మగళ్ వందాళ్ , జయసూర్య, అదితీరావు హైదరి నటించిన మలయాళ చిత్రం సూఫియుమ్ సుజాతయుమ్ సైతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.