లాక్ డౌన్ దెబ్బకు సినిమారంగం కుదేలవుతోంది. థియేటర్లలో సినిమాల విడుదలకు ఎక్కడా అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం వుంటుందోనని బయ్యర్లు, థియేటర్ల యజమానులు ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా షూటింగులు కూడా అటకెక్కాయి. సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సినిమాల విడుదల లేకపోవడంతో ఓటీటీలు, అమెజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్స్ లో మూవీస్ విడుదల చేస్తున్నారు.
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ నటించిన కొత్త చిత్రం గులాబో సితాబో. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో ఓ విలక్షణ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై లాక్ డౌన్ ప్రభావం పడింది. సినిమా విడుదలకు సిద్ధం అయినా విడుదలపై సందేహాలు ఏర్పడ్డాయి. కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నా, భారీగా జనసమూహాలు గుమికూడతాయన్న కారణంగా సినిమా హాళ్లకు ఇప్పట్లో అనుమతి వచ్చేలా లేదు. దాంతో వేరే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించారు నిర్మాతలు. జనమంతా వర్క్ ఫ్రం హోం, స్టే హోం కాబట్టి అమెజాన్ ప్రైం ద్వారా విడుదల చేస్తే బావుంటుందని భావించారు. దీంతో అమితాబ్ బచ్చన్ నటించిన గులాబో సితాబో చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజవ్వాల్సి ఉంది. అయితే వరుసగా లాక్ డౌన్ పొడిగిస్తూ ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో అమితాబ్ తో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా ముఖ్యపాత్ర పోషించాడు.