ఎనర్జీ ఇంటిపేరు . హుషారు మారుపేరు. అల్లరి అసలు పేరు. సిసింద్రీ లా చిందేస్తాడు. తారా జువ్వలా దూసుకుపోతాడు. పటాస్ లా చిటపటలాడతాడు. అతడే రామ్ పోతినేని. ఎనర్జిటిక్ స్టార్ అంటారు ఇండస్ట్రీలో. దానికి తగ్గరీతిలోనే అతడి యాక్టింగ్ , యాక్షన్ .. లాంగ్వేజ్ , బాడీ లాంగ్వేజ్ ఉంటాయి. చురుకుదనం, వేగం.. అతడి ఆయుధాలు. మొత్తానికి యూత్ ఐకాన్ లా కనిపిస్తాడు రామ్ . ఇండస్ట్రీలో ఎంతమంది యంగ్ హీరోలున్నా.. వారందరిలోనూ తనదైన ప్రత్యేకతని ప్రదర్శించి గుర్తింపు సొంతం చేసుకొన్నాడు రామ్ . తన నటనతో తెలుగు పరిశ్రమపై తనదైన ముద్ర వేశాడు. బలమైన మార్కెట్ ఉన్న యువ కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రముఖ నిర్మాత, స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిషోర్ తమ్ముడు మురళి పోతినేని తనయుడైన రామ్ హైదరాబాద్‌లో జన్మించాడు. తమిళనాడులోని చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం, సెంట్ జాన్ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. పాఠశాల వయసులోనే ఆయనకి సినిమా పరిశ్రమ నుంచి అవకాశాలు అందాయి. ఎన్.జె.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకొన్న రామ్.. వై.వి.యస్.చౌదరి దర్శకత్వం వహించిన ‘దేవదాస్’ చిత్రంతో తెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే రామ్ గురించి పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘జగడం’ చేశాడు. ఈ చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు కానీ… రామ్‌కి మంచి ప్రశంసలే లభించాయి. ఆ తర్వాత అగ్ర దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘రెడీ’ చేశాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. రామ్ కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ‘మస్కా’, ‘గణేష్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ పర్వాలేదనిపించాయి. ‘కందిరీగ’తో మళ్లీ మునుపటి ఫామ్‌ని అందుకున్న అతడు ఆ తర్వాత ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘శివమ్’ చిత్రాలు చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘నేను శైలజ’ చేసి మరో విజయాన్ని అందుకోవడంతో పాటు, తన నటనలో స్టైల్‌ని కూడా మార్చేశాడు. ‘హైపర్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’ తదితర చిత్రాలు చేసిన రామ్, గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో అలరించాడు. ఈ చిత్రంతో ఆయన లుక్ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ కుర్రాడిగా రామ్ సందడి చేశాడు. ప్రస్తుతం ‘రెడ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈరోజు రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ ఎనర్జిటిక్ స్టార్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే రామ్