కామెడీ చిత్రాలకు ఒక సీజన్ అంటూ లేదు. కడుపుబ్బ నవ్వించే కాన్సెప్ట్ ఉంటే.. హీరోల స్థాయితో సంబంధం లేకుండా ఆ సినిమాలు సూపర్ హిట్టవుతాయని చాలా సార్లు రుజువైంది. అలాంటి చిత్రాల్లో క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రం ఒకటి. శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2000, ఫిబ్రవరి 4న విడుదలై సూపర్ హిట్టైంది. యం.ఎల్.మూవీ ఆర్ట్స్ బ్యానర్ పై ఎడిటర్ మోహన్ సమర్పణలో . రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో .. రోజా, ప్రీతి, కొవై సరళ కథానాయికలు నటించారు. ఇంకా రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రవితేజ, గిరిబాబు, యం.యస్.నారాయణ, చలపతిరావు, జయప్రకాశ్ రెడ్డి, సూర్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఒక మెకానిక్ షెడ్ లో పనిచేసే ఓ ముగ్గురు .. ఇంట్లో భార్య, బిడ్డల్ని పట్టించుకోకుండా.. అనవసర ఖర్చులతో అప్పులు చేసి తాగి తందనాలాడి.. తమ భార్యలకు తలపోటుగా మారతారు. ఆ పరిస్థితుల్లో వారి భార్యలు తమ భార్తల్ని మార్చడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు? అన్నదే చిత్ర కథాంశం. ఈ కామెడీ డ్రామాలో .. హైలైట్ అయ్యే జంట.. బ్రహ్మానందం, కోవైసరళ..వారి కామెడీ సినిమా బ్లాక్ బస్టర్ కు ప్రధాన కారణమైంది. నిజానికి ఈ సినిమా 1999 లో తమిళంలో విడుదలైన ‘విరలుక్కేత్త వీక్కమ్’ చిత్రానికి రీమేక్ వెర్షన్. లివింగ్ స్టన్, వడివేలు, వివేక్ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా ఆ భాషలో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఇదే సినిమా కన్నడలో ‘యారిగే సాలుత్త సంబళ’ రీమేక్ అయి అక్కడ కూడా సూపర్ హిట్టైంది. అలాగే.. బాలీవుడ్ లోనూ ఈ సినిమా ‘ఆమ్ దానీ అత్తన్ని కర్చా రూపయా’ గా రీమేక్ అయి అక్కడ కూడా సూపర్ హిట్టైంది.