Shopping Cart 0 items - $0.00 0

మామగారు

దర్శకరత్న దాసరినారాయణరావు .. గొప్ప దర్శకుడే కాదు. అద్భుతమైన నటుడు కూడా అని చాలా సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు నిరూపించాయి. వాటిలో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘మామగారు’. మంచితనం, కల్మషం లేని మనసు, ప్రాణం కన్నా నిజాయితీ యే ముఖ్యమని భావించే మనిషి. అలాంటి పాత్ర పోషణతో అమాయకమైన తన నటనతో సినిమాకే జీవం పోశారు దాసరి. వినోద్ కుమార్ హీరోగా, యమున హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1991లో విడుదలై… ఘన విజయం సాధించింది. కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ , అన్నపూర్ణ, నిర్మలమ్మ, చంద్రప్రకాశ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఒక గ్రామానికి  ప్రెసిడెంట్ గా బాగా పలుకుబడి కలిగిన ఒక యువకుడు అమాయకమైన ఒక మంచి మనిషికి ఏరి కోరి అల్లుడు అవుతాడు .  దాని వల్ల  యువకుడి కుటుంబంలో  పలు సమస్యలు తలెత్తుతాయి.  వాటిని ఆ మామగారు ఎలా ఫేస్ చేశాడు? అన్నదే చిత్ర కథ. ఈ సినిమాలో దాసరినారాయణరావు తన అనితర సాథ్యమైన నటనతో అందరినీ కంటతడిపెట్టిస్తారు. ఆ పాత్రకు ఆయన ఆ ఏడాది ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. నిజానికి ఈ సినిమా 1991లో తమిళంలో వచ్చిన ‘నాన్ పుడిచ్చ మాపిళ్ళై’ చిత్రానికి రీమేక్ వెర్షన్. జనకరాజ్, నిళల్ గళ్ రవి ప్రధానపాత్రలు పోషించారు. ఆ తర్వాత ఇధే సినిమా కన్నడలో ‘ముద్దిన మావ’ గా విడుదలై.. అక్కడ కూడా సూపర్ హిట్టైంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ప్రధాన పాత్రను యస్పీ బాలసుబ్రహ్మణ్యం పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇందులో శశికుమార్ హీరోగా నటించాడు.   అలాగే ఇధే సినిమా బాలీవుడ్ లో సైతం మెహర్బాన్ గా విడుదలైంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా అప్పట్లో మంచి విజయం సాధించింది.

Leave a comment

error: Content is protected !!