రాజేంద్రప్రసాద్ కెరీర్ లో చెప్పుకోదగ్గ కుటుంబ కథా హాస్య చిత్రం ‘చిన్నోడు పెద్దోడు’ . శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1988. మార్చ్ 28న విడుదలై ఘన విజయం సాధించింది. చిన్నోడుగా రాజేంద్రప్రసాద్, పెద్దోడుగా చంద్రమోహన్ నటించిన ఈ సినిమాలో చంద్రమోహన్ పాత్ర హీరోయిక్ గా ఉంటుంది. ధనవంతురాలైన తన మరదల్ని అట్రాక్ట్ చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు ఎలాంటి తంటాలు పడ్డారు అన్నదే చిత్ర కథ. ఖుష్బూ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రభాకరరెడ్డి, నూతన్ ప్రసాద్, నిర్మలమ్మ, సుధాకర్, పొట్టి ప్రసాద్, తాళ్ళూరి రామేశ్వరి, శ్రీధర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తేలుకొండి అనే పాత్రలో విలన్ గా నూతన్ ప్రసాద్ .. చాలా వైవిధ్యమైన రీతిలో నటించి సత్తా చాటుకున్నారు. రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్, చంద్రమోహన్ మాస్ అపీరెన్స్ సినిమాకి హైలైట్. యస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. నిజానికి ఈ సినిమా 1987 లో తమిళంలో విడుదలైన ‘చిన్నతంబి పెరియతంబి’ చిత్రానికి రీమేక్ వెర్షన్. సత్యరాజ్ , ప్రభు హీరోలుగా నటించిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్టైంది.