ఆరడుగుల భారీ విగ్రహం… తేనెరంగు కళ్ళు… తీక్షణమైన చూపులు .. పక్కా పల్లెటూరి లాంగ్వేజ్ .. భయపెట్టే బాడీ లాంగ్వేజ్. ఆయన పేరు చలపతిరావు. సినీ రంగంలో ఆయన్ను అందరూ ‘చెర’పతిరావు అంటారు. ఆయన చాలా సినిమాల్లో రేపిస్ట్ గా నటించడంతో మహిళల్ని చెరపట్టడంలో స్పెషలిస్ట్ గా ముద్రపడ్డారు. అయితే నిజజీవితంలో ఆయన చాలా కలుపుగోలు మనిషి. అందరితోనూ సరదాగా కలిసిపోయి.. తెరమీదా, సెట్స్ లోనూ నవ్వులు పూయించడం ఆయన మనస్తత్వం. ఇప్పటివరకూ దాదాపు 1200 చిత్రాల్లో విలన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ, హాస్య నటుడిగానూ నటించి.. టాలీవుడ్ లో సూపర్ సీనియర్ గా గుర్తింపు తెచ్చుకొని.. అందరిచేతా బాబాయ్ అని పిలిపించుకుంటూ.. సత్తా చాటుకుంటున్నారు.
చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని బల్లిపర్రు ఆయన స్వగ్రామం. మణియ్య, వియ్యమ్మ దంపతులకి జన్మించారు. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకొన్నారు. స్నేహితులతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారట. అలా చదువు కూడా సరిగ్గా సాగలేదు. బాగా ఒడ్డు, పొడుగు ఉండటంతో చలపతిరావు నాటకాల్లో కథానాయకుడిగా నటించేవారట. వందలాది నాటకాలు వేసిన ఆయన ఎన్టీఆర్ నటించిన ‘కథానాయకుడు’ చిత్రంతో తొలి సినీ అవకాశాన్ని అందుకొన్నారు. తన జీవితంలో ఎన్టీఆర్ ప్రభావం బలంగా ఉందని చెబుతుంటారు చలపతిరావు. నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకొనే అలవాటున్న చలపతిరావు… ప్రతినాయకుడిగా వరుసగా సినిమాలు చేశారు. చేసిన పాత్రల ప్రభావం వల్ల మహిళలు కొన్నిసార్లు ఆయన్ని చూసినప్పుడు భయపడేవారట. తెరపై ఎలా కనిపించినా… నిజ జీవితంలో మాత్రం చాలా సరదా వ్యక్తిత్వమని చలపతిరావు గురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు. చలపతిరావు తనయుడు ‘అల్లరి’ రవిబాబు విజయవంతమైన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా కొనసాగుతున్నారు. తన తరం నటులు తెరకు దూరమైనా… చలపతిరావు మాత్రం ఇప్పటికీ అవకాశాలు అందుకుంటున్నారు. నేడు చలపతిరావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.