‘మంచుపల్లకి, సితార, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్, చెట్టుకింద ప్లీడర్ , అన్వేషణ, ఏప్రిల్ 1విడుదల, సరదాగా కాసేపు, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. గోపీ గోపిక గోదారి’ లాంటి అద్భుతమైన చిత్రాలు సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఇక వంశీ గొప్పదర్శకుడే కాకుండా.. కదిలించే కథలు రాయడంలో కూడా ఆయన దిట్ట. ఇప్పటికే ‘మా పసలపూడి కథలు, దిగువ గోదావరి కథలు, మన్యం రాణి’ లాంటి అద్భుతమైన సీరియల్స్ తో కూడా పాఠకుల మనసుల్ని కదలించారు ఆయన. ప్రస్తుతం ఒక వారపత్రికలో తన సినీ జీవిత విశేషాలతో ‘పొలమారిన జ్నాపకాలు’ ధారావాహిక రాస్తున్నారు. అలాంటి అద్భుతమైన దర్శకుడు త్వరలోనే వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.
ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ వంశీని సంప్రదించి ‘పొలమారిన జ్ఞాపకాల్ని’ వెబ్ సిరీస్గా రూపొందించాలని.. దానికయ్యే ఖర్చు భరిస్తామని చెప్పిందట. ప్రస్తుతం ఆ పనుల్ని మొదలెట్టారట వంశీ. లాక్ డౌన్ ఎత్తేశాక ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. వంశీ సినిమా అంటేనే సహజమైన పాత్రలు.. హృదయానికి హత్తుకొనే సంగీతం.. గలగల పారే గోదావరి ఇవే గుర్తొస్తాయి. మరి ఈ వెబ్ సిరీస్ కూడా అదే కోవలో రూపొందిస్తాడేమో చూడాలి.