అలతి పదాలతో అర్ధవంతమైన రచన ఆయన శైలి. సరికొత్త పదాలతో ప్రయోగాలు చేయడం ఆయన హాబీ. ఊతపదాలతో సంభాషణలకు ఊపు తెచ్చిపెట్టి.. వాటిని ప్రజల నాలుకల మీద నర్తింప చేయడం ఆయన టాలెంట్. తెలుగు భాషలోని చమత్కారాలన్నీ.. తన కలం నుంచే జాలు వార్చి .. వెండితెరమీద నవ్వులు పువ్వులు పూయించిన గొప్ప సాహితీ వేత్త ఆయన. పేరు పింగళి నాగేంద్రరావు. సామెతలు, లోకోక్తులు , చమత్కారాలు.. తెలుగు మాటల గారడీలు ఆయన పెన్నుకు భలే సరదా. ఆయన కలం వెలువరించిన పరిమళ సాహిత్య సంపద తెలుగు చిత్రసీమలో గుబాళించింది.
శ్రీకాకుళం జిల్లా రాజాం లో జన్మించారు పింగళి నాగేంద్రరావు. ‘వింధ్యారాణి’ చిత్రంతో పింగళి తెలుగు సినీరంగంలో సంభాషణల రచయితగా అడుగుపెట్టారు. ఆ సినిమా ఘోర పరాజయం పాలైనా సరే.. ఆ సినిమా పింగళి ఎదుగుదలకు బాగా దోహదం చేసింది. ఆ తర్వాత విడుదలైన ‘గుణసుందరి కథ’తో ఆయన జాతకమే మారిపోయింది. విజయావారి కొలువులో పింగళి ఆస్థాన రచయిత అయిపోయారు. షావుకారు , ఆ తర్వాత వచ్చిన పాతాళభైరవి చిత్రంతో స్టార్ రైటర్ గా అవతరించారు పింగళి. ఆ వెంటనే ‘మాయా బజార్’ అఖండ విజయం తో పింగళి పేరు తెలుగు నాట మారుమోగిపోయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో పింగళి తన మార్కు చూపించి.. వాటి విజయాలకు కారణమయ్యారు. ‘లవకుశ’, ‘నర్తనశాల’ ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘సత్యహరిశ్చంద్ర’ ,‘ప్రమీలార్జునీయం’ ‘శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు కథ’ ,‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ , ‘భాగ్యచక్రం’ చిత్రాలకు పింగళి రచనచేసి, మాటలు, పాటలు సమకూర్చి అద్భుతాలు సృష్టించారు. ఇక ఎన్.టి. రామారావు 1977లో నిర్మించిన ‘చాణక్య చంద్రగుప్త’ సినిమాకు చివరిసారిగా పింగళి కథ, మాటలు సమకూర్చారు. అయితే 1971లో విడుదలైన ‘శ్రీకృష్ణ సత్య’ కు కథ, మాటలు, పాటలు; 1973లో విడుదలైన సింగీతం శ్రీనివాసరావు తొలిచిత్రం ‘నీటి-నిజాయితీ’ చిత్రానికి మాటలు, ఒక పాట; 1977లో విడుదలైన ‘చాణక్య చంద్రగుప్త’ చిత్రానికి కథ మాటలు సమకూర్చగా ఆ చిత్రాలు పింగళి మరణానంతరం విడుదలయ్యాయి. జీవితాంతం బ్రహ్మచారిగానే గడిపిన పింగళి, రామమూర్తి అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. నేడు పింగళి వర్ధంతి. ఈ సందర్భంగా ఆ సాహితీ సార్వభౌముడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.