అల్లు అర్జున్ సినీ కెరీర్ కు గట్టి పునాదులు వేసిన చిత్రం ‘పరుగు’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో నిర్మితమైన ఈ సినిమా 2008, మే2న విడుదలై నేటికి సరిగ్గా పుష్కర కాలం పూర్తి చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించే తండ్రులకు .. ఆ మహాలక్ష్మే తమని మోసం చేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోతే .. ఆ పెయిన్ ఎలా ఉంటుంది? అసలు వెళ్లిపోయినవారు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? లేదా అనేదే పరుగు చిత్రం థీమ్. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించగా.. అతడి పెద్ద కూతురుగా పూనమ్ బజ్వా నటించగా.. రెండో కూతురు (హీరోయిన్ ) గా షీలా కౌర్ నటించగా, ఆమెను తొలి చూపులోనే ప్రేమించి.. ఆమె తండ్రిని ఒప్పించి అందరు ప్రేమికులూ ఒకటి కాదు అని నిరూపిస్తాడు అల్లు అర్జున్ . ఇక చిత్రం శ్రీను, సునీల్, సప్తగిరి, సుబ్బరాజు, జయప్రకాశ్ రెడ్డి, జీవా, ధన్ రాజు, ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీత సారధ్యంలోని అన్నిపాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. నమ్మవేమో గానీ పాట కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. రెండు నంది అవార్డుల్ని కైవసం చేసుకున్న ‘పరుగు’ చిత్రం ఇటు బన్నీకి, అటు బొమ్మరిల్లు భాస్కర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.