మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం ‘శంకర్ దాదా యం.బి.బి.యస్’. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్ పై అక్కినేని రవిశంకర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2004 , అక్టోబర్ 15 విడుదలై .. రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. తన తల్లిదండ్రుల దగ్గర తను డాక్టర్ అని అబద్ధమాడిన శంకర్ అనే దాదా .. దాన్ని నిజం చేయడానికి ఒక మెడికల్ కాలేజ్ లో డాక్టర్ కోర్స్ లో జాయిన్ అవుతాడు. అక్కడ హాస్పిటల్ వాతావరణం, రోగుల పట్ల యాజమాన్యం చూపిస్తోన్న నిరాదరణను చూసి సహించని శంకర్ అక్కడ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? అలాగే.. ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఎలా బుద్ధి చెప్పాడు అనే కథాంశంతో ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీగా తెరకెక్కింది. ముఖ్యంగా మెగాస్టార్ కామెడీ టైమింగ్, ఆయన పలికే ఇంగ్లీష్ సామెతలు అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో కథానాయికగా సోనాలీ బింద్రే నటించగా.. పరేశ్ రావల్, గిరీష్ కర్నాడ్, వెన్నిరాడై నిర్మల, శ్రీకాంత్, సూర్య, ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా 2003లో బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘మున్నాభాయ్ యం.బీ.బీ.యస్’ చిత్రానికి రీమేక్ వెర్షన్. సంజయ్ దత్, అర్షద్ వార్సి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కథానాయికగా గ్రేసీ సింగ్ నటించింది. ఆ తర్వాత ఇదే సినిమా తమిళంలో కమల్ హాసన్, ప్రభు తో ‘వసూల్ రాజా యం.బీ.బీ.యస్’ గానూ, కన్నడలో ఉపేంద్ర హీరోగా ‘ఉప్పీదాదా యం.బీ.బీ.యస్’ గానూ విడుదలై.. అక్కడ కూడా ఘనవిజయం సాధించాయి.