నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రాల్లో ‘పెళ్లికానుక’ ఒకటి. వీనస్ పిక్చర్స్ పతాకంపై, యస్.కృష్ణ మూర్తి, టీ. గోవిందరాజన్, సంయుక్త నిర్మాణంలో  శ్రీధర్ (వయసు పిలిచింది దర్శకుడు)  దర్శకత్వం వహించిన  తొలి చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 1960, ఏప్రిల్ 29న విడుదలై అఖండ విజయం సాధించింది. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా సరిగ్గా నేటికి 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది  బీ.సరోజ, కృష్ణ కుమారి కథానాయికలుగా…  గిరిజ, కొంగరజగ్గయ్య, రేలంగి, మాలతి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ప్రముఖ నేపథ్యగాయకుడు ఏ.యం.రాజా ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా అవతరించి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. పులకించని మది పులకించు, వాడుక మరిచెదవేలా, కన్నులతో పలకరించు లాంటి పాటలు తెలుగువారిని ఉర్రూతలూగించాయి. అంతేకాదు.. ఇందులో  తొలి సారిగా ఏయమ్ రాజా అక్కినేనికి నేపథ్యగానం  పాడడం విశేషం.  ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఒకే వ్యక్తిని ప్రేమించడం, అక్కకోసం చెల్లెలు త్యాగం చేసి, హీరోను ఒప్పించి పెళ్లిచేయడం, వారికి కలిగిన కుర్రవాడిని చెల్లెలు పెంచడం,  అక్క మంచమెక్కి మరణించడంతో హీరో తన పిల్లవాడిని వాసంతి-రఘులకు పెళ్లికానుకగా ఇచ్చి దూరతీరాలకు వెళ్లిపోవడం టూకీగా ఈ సినిమా కథ. ఇందులో కృష్ణకుమారి, సరోజాదేవి అక్క చెల్లెళ్ళు గా నటించగా హీరో భాస్కర్‌గా అక్కినేని నటించారు. లక్ష రూపాయల బడ్జట్‌లో చిత్రాన్ని శ్రీధర్‌ పూర్తిచేశారు. ఈ సినిమాలో విలన్‌ లేడు. పైగా పాత్రలన్నీ సహృదయం కలిగినవే కావడం విశేషం.  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘దేవత’ చిత్రానికి స్ఫూర్తి ఈ సినిమానే కావడం విశేషం.

Leave a comment

error: Content is protected !!