కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన చిత్రం శుభసంకల్పం. 1995, ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. కమలహాసన్, ఆమని, కె.విశ్వనాథ్, గొల్లపూడి, ప్రియారామన్ ప్రధాన పాత్రధారులు. కమలహాసన్, ఆమని నటన ప్రదర్శించిన తీరు చాలా సహజంగా ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు మాటలు సున్నితమైన భావోద్వేగాన్ని గురిచేస్తాయి. కె.విశ్వనాథ్ హుందాతనంతో, తెలుగుదనం కనబడేలా, చుట్టతో కనబడి బాగా నటించారు. మత్స్యకారుల జీవిత ఇతివృత్తాన్ని, సముద్ర తీరంలో వాళ్ల జీవనాన్ని ఎంచుకుని ప్రేక్షకులకు నచ్చేలా తీసిన సినిమా.
ఇంకా సినిమాలో ప్రపంచ దేశాల వాళ్లతో లెక్కలు వేసే సన్నివేశం, నిర్మలమ్మతో మాటలు, చేపలు పట్టే మూకాభినయం, సముద్రంలో ఫైట్, ఆలీ హాస్యం, కోట శ్రీనివాసరావు పసుపునీళ్ల విలనిజం, ఏవిఎస్ హాస్యపాత్ర, సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి హాస్యం, గొల్లపూడి నటన, కమల్‌హాసన్, ఆమని జంట, ప్రియారామన్ సున్నితమైన నటన- ఇవన్నింటిని ఒకచోటకి తెచ్చిన ఘనత కె.విశ్వనాథ్‌కే దక్కుతుంది. ‘సీతమ్మ అందాలు’ పాటలో పెళ్లి, హరిపాదాన పుట్టావమ్మ గంగమ్మా, హైలెస్సో, హైలెస్సో, నరుడు బ్రతుకు నటన, దండాలట్టే స్వామికి దండాలయ్యా స్వామికి దండకాలు ఓ దొరా! మా దొర!’ కీరవాణి పాటలు వీనుల విందుగా కళాత్మక దృష్టిని అందిస్తాయి ప్రేక్షకులకి. సంగీతపరమైన సినిమాలను తీర్చిదిద్ది, సాహిత్యపరమైన అంశాలను పొందుపరచి ప్రతీ పాత్రను సమాజం నుండి సంప్రదాయ పద్ధతి అన్వయించి సందేశం ఇస్తూ తీసినందుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అర్హత సంపాదించుకున్నారు. ఈ అంశాలు అన్నీ శుభసంకల్పం సినిమాలో వున్నాయి. సంకల్పం బలమైతే ఏదైనా శుభం అవుతుంది అని నిరూపించిన సినిమా.