అందమైన ముఖం.. చక్రాల్లాంటి కళ్ళు .. కోటేరు లాంటి ముక్కు..  చక్కటి చిరునవ్వు.. వెరశి దేవిక. టాలీవుడ్ లో ఒకప్పటి తరం నాయిక . దాదాపు ఆ తరం అగ్రహీరోలందరి సరసన నటించి మెప్పించిన మేటి నాయిక ఆమె.  తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న దేవిక అసలుపేరు ప్రమీలాదేవి.

ఆమె పుట్టింది మద్రాసు నగరంలో. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు మనవరాలు దేవిక . ఆమె మేనమామ ఆ రోజుల్లో మద్రాసు నగర మేయర్‌గా వుండేవారు. చిన్నతనంలో దేవికకు సంగీతం, డాన్సు నేర్పించి మంచి కళాకారిణిగా చూడాలని అమ్మమ్మ తాపత్రయం. ఆమె బాగా పాడేది. చాలా భాషల్లో ఆమెకు ప్రావీణ్యం వుండేది. దేవికకు యుక్తవయసు రాగానే వాళ్ల అమ్మమ్మ దేవికకు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. 1955లో ఘంటసాల బలరామయ్య కుమారుడు కృష్ణమూర్తి పి.పుల్లయ్య దర్శకత్వంలో ప్రతిభా బ్యానర్‌ మీద ‘రేచుక్క’ చిత్రాన్ని నిర్మించారు. అదే దేవికకు తొలి చిత్రానుభవం. అందులో లలితాదేవి పాత్రను దేవిక పోషించింది. సినిమా క్రెడిట్స్‌లో దేవిక పేరును ‘ప్రమీల’గా వేశారు. ఆ తర్వాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘మహామంత్రి తుమ్మరుసు’లో అన్నపూర్ణాదేవిగా, బోళ్ల సుబ్బారావు నిర్మించిన ‘దేశద్రోహులు’, జెమినీ వారు నిర్మించిన ‘ఆడబ్రతుకు’, ఎ.కె.వేలన్‌ నిర్మించిన ‘మంగళసూత్రం’, మిద్దె జగన్నాథరావు నిర్మించిన ‘నిండుమనసులు’, యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ‘కంచుకోట’, ’నిలువుదోపిడి’, చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘భామావిజయం’, పుండరీకాక్షయ్య నిర్మించిన ‘శ్రీకృష్ణావతారం’, డి.వి.ఎస్‌.రాజు నిర్మించిన ‘రాజకోట రహస్యం’ ఎన్‌.ఎ.టి వారు నిర్మించిన ‘శ్రీకృష్ణ సత్య’ వంటి చిత్రాల్లో ఎన్‌.టి. రామారావుకు దేవిక జంటగా నటించింది. రామారావు-దేవికను మంచి హిట్‌ పెయిర్‌ అనేవారు. అందుకు కారణం వారిద్దరూ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ హిట్లు కావడమే. అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రం దేవిక హీరోయిన్‌గా నటించలేదు. వదినగా మాత్రమే నటించింది. మలయాళంలో ఐదు చిత్రాల్లోనూ, హిందీలో నాలుగు చిత్రాల్లోనూ దేవిక నటించింది. మొత్తం మీద ఆమె 150 చిత్రాలకు పైగానే నటించింది. చారిత్రాత్మక చిత్రాలకు, పౌరాణిక చిత్రాలకు దేవిక సరైన నటి అని తమిళ నిర్మాతలు నమ్మేవారు. నేడు దేవిక జయంతి. ఈ సందర్భంగా ఆ అందాల మల్లిక కు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.  

 

Leave a comment

error: Content is protected !!