ఆయన సినిమాలు అటు మాస్ ను మెప్పిస్తాయి.. ఇటు క్లాస్ ను అలరిస్తాయి. తన సినిమాల్లో హీరోలకు హై ఓల్ట్ ఇమేజ్ ఇచ్చి.. వారిని బాగా ఎలివేట్ చేయడం అప్పట్లో ఈ దర్శకుడికి పరిపాటిగా ఉండేది. అలాగే.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న తెలుగు దర్శకుల్లో ఈయన కూడా ఒకరు. పేరు బాపయ్య. అందరూ మాస్ కా బాప్ అనేవారు. తెలుగు, హిందీ భాషల్లో 80 చిత్రాలకు పైగానే డైరెక్ట్ చేసిన ఆ మేటి దర్శకుడు.. దాదాపు గా అప్పటి అగ్రహీరోలందరినీ డైరెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బాబాయ్ కొడుకైన కోవెలమూడి బాపయ్య చిన్నప్పుడే తల్లి దండ్రుల్ని కోల్పోయారు. ఆయన్ను పెదనాన్న కె.యస్. ప్రకాశరావే చేరదీశారు. విజయవాడ, చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసిన బాపయ్య.. అప్పటి మేటి దర్శకుడు కె.బీ. తిలక్ దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయ్యారు. ముద్దుబిడ్డ, యం.ఎల్.ఏ, అత్తా ఒకింటి కోడలే లాంటి చిత్రాలకు ఆయన దగ్గర అసోసియేట్ గా పనిచేశారు. అనంతరం సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలిచిత్రం రాముడు భీముడు చిత్రానికి తాపీ చాణక్య దగ్గర అసోసియేట్ గా జాయిన్ అయ్యారు. అదే సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ‘ద్రోహి’ చిత్రంతో బాపయ్య దర్శకుడిగా మారారు. ఆ సినిమా పరాజయం పాలైనా.. దర్శకుడిగా బాపయ్యకు అవకాశాలు ఆగలేదు. ఎదురులేని మనిషి, సోగ్గాడు. యుగపురుషుడు, మండేగుండెలు, ముందడుగు, గురు శిష్యులు లాంటి బ్లాక్ బస్టర్స్ తో బాపయ్య టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక చిరంజీవితో కూడా ఇంటి గుట్టు, చట్టంతో పోరాటం లాంటి చిత్రాలకు పనిచేశారు బాపయ్య. ఆయన ఆఖరి చిత్రం కృష్ణ హీరోగా నటించిన ‘మావూరి మగాడు’. నేడు బాపయ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ మాస్ దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
’