పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపుతిప్పిన సూపర్ మాస్ లవ్ స్టోరీ ‘బద్రి’. దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కు ఇదే తొలి సినిమా అవడంతో పాటు .. ఫస్ట్ ఎటెమ్ట్ లోనే మాస్ జనం పల్స్ తెలుసుకొని సూపర్ హిట్టు కొట్టడం అతడికే చెల్లింది. 2000, ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రేణుదేశాయ్, అమీషా పటేల్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా .. అప్పటి యూత్ ను ఉర్రూత లూగించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటల్ని యూత్ ఫుల్ గా కంపోజ్ చేసి.. ఎవర్ గ్రీన్ హిట్స్ గా మలిచాడు సంగీత దర్శకుడు రమణ గోగుల.
తొలిప్రేమతో స్టార్ స్టేటస్, తమ్ముడుతో మాస్ హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్నాడు అప్పుడు పవన్ కళ్యాణ్ . వరుస హిట్లతో ఉన్న పవన్ కు మాసివ్ కంటెంట్ లవ్ స్టోరీ బద్రి చెప్పాడు పూరి జగన్నాధ్. క్లాస్ టచ్ ఉన్న సబ్జెక్టుకు పవన్ మాస్ మేనరిజమ్స్, స్టైలిష్ యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యాయి. మెడ మీద చేయి వేసుకునే పవన్ మార్క్ మాస్ మేనరిజమ్ బద్రితోనే మొదలైంది. పూరికి తొలి సినిమానే అయినా పవన్ ను స్టైలిష్ గా చూపించడంతో పాటు డైలాగ్ డిక్షన్ కూడా మార్చేశాడు. ‘నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాధ్.. అయితే ఏంటి’ అనే డైలాగ్ అప్పట్లో మోగిపోయింది. విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై టి.త్రివిక్రమరావు ఈ సినిమా నిర్మించారు.