కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీని ఉగ్రతకు ఎన్నోదేశాలు కకావికలం అయిపోయాయి.  దీని దెబ్బకు మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఇబ్బందులతో  సినిమా రంగం కూడా కుదేలయింది. షూటింగులు నిలిచిపోవడంతో రోజువారీ కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో పనులు లేక పస్తులతో జీవితాల్ని వెళ్లదీస్తున్న సినీ కార్మికులకు బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌బచ్చన్‌ బాసటగా నిలిచారు. ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ కాన్ఫెడరేషన్‌కు చెందిన లక్ష కార్మిక కుటుంబాలకు నెలవారీ రేషన్ సరుకుల్ని అందివ్వనున్నారు. మనమంతా ఒక్కటే అనే నినాదంతో దేశవ్యాప్తంగా సినీ, టీవీ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు  ప్రతి నెల నిత్యావసర సరుకుల్ని అందజేస్తామని ప్రకటించారు.

అమితాబ్‌బచ్చన్‌ సారథ్యంలో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా, కల్యాణ్‌ జ్యూవెలర్స్‌ సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నారు. ఈ వితరణలో భాగంగా సినీ కార్మికులకు డిజిటల్‌ బార్‌కోడ్‌ కూపన్స్‌ అందిస్తాం. వాటి ద్వారా ఆమోదిత సూపర్‌మార్కెట్స్‌, గ్రాసరీ స్టోర్స్‌ నుంచి కార్మికులు సరుకుల్ని పొందవచ్చు’ అని సోనీ పిక్చర్స్‌ ప్రతినిధి తెలిపారు. అమితాబ్ బచ్చన్ చొరవకు సినీ రంగం సలాం చేస్తోంది. అమితాబ్ చేస్తోన్న ఈ మహోపకారానికి మెగాస్టార్ చిరంజీవి సలాం అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని  కార్మికులకు అమితాబ్ జీ నెలకు రూ. 1500 విలువ చేసే  సరుకుల్ని అందచేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు.

Leave a comment

error: Content is protected !!