కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది.  పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు.

ఈ సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా బాధపడుతున్నారు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు మన కోసం కష్టపడుతుంటే మనం ఇంట్లో ఉండలేక ఇబ్బంది పడుతున్నామని, ఆ ఆలోచన మార్చుకోవాలని ప్రముఖ నటుడు జగపతి బాబు కోరారు. ట్విటర్‌ వేదికగా ఆయన తన మనసులో మాట పంచుకున్నారు. ‘ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు నాకూ మైండ్‌ పనిచేయలేదు. ఇలాంటి సందర్భంలో పాజిటివ్‌గా ఉంటామా, నెగెటివ్‌గా మారతామా అనేది మనమీదే ఆధారపడి ఉంది. నేను నాలుగేళ్లుగా యోగా చేస్తున్నాను. కాలక్షేపం కోసం మద్యం సేవిద్దాం అనుకున్నా. కానీ, దాని వల్ల ఉపయోగం లేదు అనిపించి ఆ సమయాన్ని యోగాకి కేటాయించాను. శారీరకంగా,మానసికంగా శిక్షణ ఉంటేనే శక్తి వస్తుంది. ప్రతి దానికి టైం లేదు టైం లేదు అంటుంటాం. ప్రకృతి ఇప్పుడు టైం ఇచ్చింది. మనల్ని నిర్భంధించారు, బయటికి వెళ్లనివ్వడం లేదు అని అనుకోవద్దు. మన ఏమైనా జైల్లో ఉన్నామా? మన ఇంట్లోనే కదా ఉన్నాం’ అన్నారు. వీటితోపాటు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు జగపతి.

 

Leave a comment

error: Content is protected !!