ఆయనది రావుగోపాలరావులా గంభీరమైన వాయిస్ కాదు. ఆయనకి కైకాల సత్యనారాయణ లా హావభావ విన్యాసాలు తెలియవు. కానీ కళ్ళల్లో కరుడుగట్టిన విలనిజం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సైలెన్స్ ఎంత భయంకరమైనదో .. తెరమీద ఆయన వయలెన్స్ కూడా అంతే ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆయన స్పాట్ పెడితే.. స్పాట్ లో ఎవడైనా టపా కట్టేయాల్సిందే. ఆ విలన్ పేరు రామిరెడ్డి. తెలుగు తెరపైకి దర్శకుడు కోడి రామకృష్ణ సంధించిన పవర్ ఫుల్ మిస్సైల్. తొలి చిత్రంతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన అనితర సాధ్యమైన నటనతో భయపెట్టిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 250 చిత్రాల్లో నటించి మెప్పించారు. కరడు కట్టిన విలన్‌గానే కాకుండా కామెడీ పాత్రల్లోనూ తన ప్రజ్ఞ నిరూపించుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజే జర్నలిజం చేసి… చిత్రసీమపై మక్కువ ఎక్కువ కాగా తెరపై కనిపించాలనే కోరికతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ క్రమంలోనే 1990లో ‘అంకుశం’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసే అవకాశాన్ని ఆయన దక్కించుకున్నారు. సినిమా రంగానికి రాకముందు జర్నలిస్ట్‌గా కొద్దికాలం పనిచేసారు. ‘అంకుశం’ చిత్రం రొటీన్‌కి భిన్నంగా ఉండడంతో విజయాన్ని చవి చూసింది. ఆ చిత్రంతో వరుస అవకాశాలు రామిరెడ్డిని వెతుక్కుంటూ వచ్చాయి. ‘అభిమన్యు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ప్రతిబంధ్’, ‘క్షణ క్షణం’, ‘420’, ‘పెద్దరికం’, ‘అమ్మోరు’, ‘గాయం’, ‘అనగనగా ఒక రోజు’, ‘ఒసేయ్ రాములమ్మా’… ఇలా దాదాపు 250కి పైగా చిత్రాలు చేశారు. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, భోజ్‌పురి భాషల్లో కూడా ఆయన నటించి పేరు తెచ్చుకున్నారు. నేడు రామిరెడ్డి వర్ధంతి . ఈ సందర్భంగా ఆ విలక్షణ నటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.