ఆయన ఒక కథా రచయిత, ఒక నవలా రచయిత, ఒక రంగస్థల నాటక రచయిత, ఒక వక్త, ఒక పాత్రికేయుడు, ఒక సినిమా రచయిత, ఒక సినిమా నటుడు, ఒక బుల్లితెర ప్రయోక్త. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు. అందరూ ముద్దుగా గెద్దముక్కు పంతులు అని పిలుచుకుంటారు. విలక్షణమైన నటనకు, వైవిధ్యమైన పాత్రలకు ఆయన పెట్టింది పేరు. పాలిష్డ్ విలనిజానికి గొల్లపూడి కేరాఫ్ అడ్రెస్ . నవ్వుతూనే గొంతుకోసే ప్రతికథానాయకుడిగా అద్భుతంగా నటించగలరు , అలాగే.. కరుణ రసం ఉట్టిపడే ప్రధాన పాత్రలతో సినిమాకు కథానాయకుడిలాంటి పాత్రలతోనూ ప్రాణం పోయగలరు. చిరంజీవి కథానాయకుడిగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. దటీజ్ సుబ్బారావు అనే పాపులర్ డైలాగ్ తో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని సంపాదించుకున్నారు.
1963లో ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి స్ర్కీన్‌ప్లే రాశారు గొల్లపూడి. ఆయనకి అదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుని అందుకున్నారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తరువాత నటుడిగా కూడా బిజీ అయిపోయారు. 250 చిత్రాలకిపైగా సహ నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. ‘సంసారం ఒక చదరంగం’, ‘స్వాతిముత్యం’, ‘తరంగిణి’, ‘త్రిశూలం’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘ముద్దుల ప్రియుడు’, ‘ఆదిత్య 369’ ‘సుందరాకాండ’ తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్వహించిన పోటీలకి సంబంధించిన జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించారు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశారు. ఆయన చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ 1992 ఆగస్టు 12న మరణించారు. తన తొలి ప్రయత్నంగా ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మారుతిరావు తన కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డుని నెలకొల్పారు. ఉత్తమ నూతన దర్శకుడికి రూ: 1.50 లక్షలు నగదు బహుమతినీ, ప్రముఖ చిత్ర కారుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తున్నారు. నేడు గొల్లపూడి జయంతి. ఈ సందర్భంగా ఆ మహా నటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.