సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 350పై చిలుకు చిత్రాల్లో నటించగా.. అందులో అత్యధిక చిత్రాలు కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషంగా చెప్పుకోవాలి. ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ సినిమాతో మొదటిసారిగా కలిసిన ఈ ఇద్దరి కాంబో .. ఆ తర్వాత దాదాపు 30 చిత్రాలకుపైగానే రూపొంది అందులో ఎక్కువ శాతం విజయవంతం కావడం ఒక రికార్డు గా చెప్పుకోవాలి. అలాంటి వాటిలో ఒక సినిమా ‘మామా అల్లుళ్ళ సవాల్’. సరిగ్గా 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కృష్ణ, కైకాల సత్యనారాయణ ముఖ్యపాత్రలు పోషించారు.
లాయర్ అయిన మేనల్లుడు తన మేనమామ అరెస్ట్ చేసిన ఒక వ్యక్తి తాలుక కేసును పరిశోధించి .. అతడు నిర్దోషి అని నమ్మి అతడి తరపున వాదించడానికి సిద్ధపడతాడు. నిజాయితీ పరుడైన మేనమామ అతడే నిర్దోషి అని బలంగా నమ్ముతాడు. మరి ఈ ఇద్దరి మధ్య జరిగే ధర్మపోరాటంలో ఎవరిది పై చేయి అవుతుందనే కథతో ‘మామా అల్లుళ్ళ సవాల్’ చిత్రం తెరకెక్కింది. జమున, చంద్రమోహన్, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య, రమాప్రభ, నిర్మల, జయమాలిని ముఖ్య భూమికలు పోషించారు. ఈ సినిమాకి యం.డి.సుందర్ కథను అందించగా.. జంధ్యాల సంభాషణలు సమకూర్చారు. వేటూరి సుందరరామమూర్తి, వీటూరి గీత రచన చేయగా.. చక్రవర్తి స్వరకల్పన చేశారు. “ఒక నాటిది కాదు వసంతం”, “చిటుక్కు చిటుకు”, “చక్కనమ్మ వచ్చింది”, “మంచితనానికి మాయని మమత”, “చక్కనైన మా కృష్ణయ్యను”, “ఓ మండపేట మైనర్”, “శ్రీదేవి వంటి మా చిట్టితల్లికి”.. వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ సమర్పించగా.. శ్రీ లక్ష్మీనారాయణ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కుదరవల్లి సీతారామస్వామి నిర్మించారు.