తెలుగు సినిమాకు దశా నిర్ధేశం చేసిన దర్శకుడు ఆయన. మూస కథల ధోరణిలో కొట్టుమిట్టాడుతున్న తరుణాన టాలీవుడ్ లో సినిమా అంటే.. ఇదీ అని చాటిచెప్పిన గొప్ప క్రియేటర్ . కాలేజీ రాజకీయాలపై సైకిల్ చెయిన్ విసిరి తెలుగుతెరకు శివను పరిచయం చేసిన ఆయనపేరు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత మాఫియా చిత్రాలకు పెద్దన్నగా, దెయ్యం సినిమాలకు పితామహుడిగా మారాడు వర్మ.
ఎన్నో సంచలన విజయాల్ని అందుకొన్న ఆయనే… అంతకు రెట్టింపు స్థాయిలో ఫ్లాప్ సినిమాలు కూడా తీశాడు. కానీ… సక్సెస్ఫుల్ సినిమాకీ, ఫ్లాప్ సినిమాకీ నేను పడే కష్టం ఒకటే అని చెబుతుంటాడు వర్మ. మరో అడుగు ముందుకేసి నా సక్సెస్‌లన్నీ అనుకోకుండా వచ్చినవే అని కూడా చెబుతారాయన. ఆయన ఏ కథ ఎంచుకొన్నా ఒక సంచలనమే. ఆయన సినిమాలు సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే వార్తల్లో నిలుస్తుంటాయి. తెలుగులో ‘శివ’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన వర్మ ఆ తరువాత హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు తీశారు. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఆయన సంచలన విజయాల్ని సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగానే కాకుండా, రచయితగా, నిర్మాతగా కూడా ఆయన చిత్ర పరిశ్రమలో ప్రయాణం చేశాడు. ఆర్జీవీ అంటే… ఓ సంచలనం. సినిమాల ద్వారా వినోదాన్ని అందించడమే కాదు… తరచూ వివాదాలు కొని తెచ్చుకోవడం కూడా ఆయన శైలి. ఆయన మౌనంగా ఉన్నా, మాట్లాడినా, సినిమా తీసినా, తీయకున్నా మీడియా ఫోకస్ ఎప్పుడూ ఆయన మీదే ఉంటుంది. ఉరుము ఉరిమినట్లు హఠాత్తుగా ట్వీట్ చేసినా ఉలిక్కిపడే జనాలెంతో మంది. ఈ ప్రపంచంలో ఏ అంశమైనా ఆయన కళ్లల్లో పడితే పిచ్చ పబ్లిసిటీ. పొగరనిపించే ముక్కుసూటితనం, నా ఇష్టం…నేనింతేనంటూ లోకం ముందు తన గురించి చెప్పుకోవడంలో నిజాయితీ కన్నా జనాలకు నిర్లక్ష్యం కనిపిస్తే …అది కచ్చితంగా ఆయన తప్పు కాదు. ఆయన్ని అర్ధం చేసుకోవడంలో విఫలమైన జనాలదే పొరపాటు. ఆయన తన శైలిలో అన్నీ చెప్తారు. ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్ధమవుతుందంతే. నేడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు . సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే ఆర్జీవీ .