జంధ్యాల గారు ఎన్ని హాస్య చిత్రాలు తీసినా.. ఆయన లోని మరో మనిషి అప్పుడప్పుడు కొన్ని కరుణా రసాత్మకమైన చిత్రాలు తీసి వాటితో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఓ హార్ట్ టచింగ్ మూవీ ‘ముద్దుల మనవరాలు’. భానుమతి, సుహాసిని, చంద్రమోహన్ ,శరత్ బాబు, జయసుధ తారాగణంగా 1986లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో తెలుగులో ఘన విజయం సాధించింది. ఒంటరిగా జీవిస్తోన్న ఒక వృద్ధురాలి దగ్గరకి మనవరాల్ని నంటూ చేరుతుంది ఒకమ్మాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు.. ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన తన కూతురి కూతురే అని తెలుసుకుంటుంది. ఆ అమ్మాయితో బాండింగ్ ఏర్పడిన ఆ ముసలావిడకి .. ఆ మనవరాలి గురించి మరో నిజం తెలుస్తుంది. ఆ మనవరాలితో చివరికి ఆవిడ పయనమెటు అన్న కథతో ఈ సినిమా చాలా హృద్యంగా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా మలయాళంలో 1984 లో వచ్చిన ‘నోకేత్త దూరత్తు కణ్ణుమ్ నట్టు’ సినిమాకి రీమేక్ వెర్షన్. మోహన్ లాల్, నదియా , పద్మిని తదితరులు నటించిన ఈ సినిమాకి ఫాజిల్ దర్శకుడు.