గాడ్ ఫాదర్స్ లేరు. బ్యాక్ అప్ ఎవరూ లేరు. అయినా సరే సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఒంటరిగా ఎదుర్కొని హీరోగా నిలబడ్డాడు ఆయన. పేరు శ్రీకాంత్. స్వయం కృషితో పైకొచ్చిన హీరోలిస్ట్ లో ఆయన పేరు కూడా చేరిపోయింది. మేకా శ్రీకాంత్ అని పిలిపించుకొనే ఆయన.. శతాధిక చిత్రాల్ని పూర్తి చేసిన హీరోల లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు. తన కెరీర్ మొత్తం లో 125 సినిమాలు పూర్తి చేసిన శ్రీకాంత్ .. నిర్మాతగా కూడా అభిరుచి చాటుకున్నారు.
కొప్పల్ జిల్లా గంగావతిలో జన్మించిన శ్రీకాంత్ .. కర్నాటక విశ్వవిద్యాలయంలో బికామ్ పూర్తి చేశారు. సినిమాల మీద మక్కువతో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి.. డిప్లమో సంపాదించారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్ కౌంటర్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు. అయితే తాజ్ మహల్ చిత్రంతో ఆయన హీరోగా మారి.. అప్పట్లో చాలా తక్కువ పోటీనెదుర్కొని హీరోగా స్థిరపడ్డారు. వన్ బై టు, వినోదం, పెళ్లిసందడి, మానాన్నకు పెళ్లి, గిల్లి కజ్జాలు, ప్రేయసి రావే, హలో ఐలవ్ యూ , ఆహ్వానం, పండగ, తాళి, ఊయల, ఒట్టేసి చెబుతున్నా లాంటి చిత్రాలతో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘ఖడ్గం’ చిత్రంతో మాస్ హీరోగా అదరగొట్టారు. ఇటీవల శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తూనే, మునుపటిలా ప్రతినాయక పాత్రలతో అలరిస్తున్నారు. నేడు శ్రీకాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్