దర్శకుడు కోడిరామకృష్ణ తెరకెక్కించిన చిత్రాల్లో చాలా ప్రత్యేకమైనది ‘మధురానగరిలో’. అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రోళ్ళ జీవితాల్లోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. అయితే ఆమెకున్న ఒక సమస్య తీర్చడానికి రంగంలోకి దిగిన ఆ కుర్రోళ్ళు చివరికి ఆపదలోకి చిక్కుకుంటారు. ఫైనల్ గా దాన్నుంచి వాళ్ళు నలుగురూ ఎలా బైటపడతారన్నదే చిత్రకథ. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్, రవిశంకర్ తో పాటు రియాజ్ ఖాన్ అనే మలయాళ కుర్రోడ్ని కోడి రామకృష్ణ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం చేయడం విశేషం. అందులో నాలుగో కుర్రోడైన చిన్న అప్పటికి ‘శివ’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకొని జోరుమీదున్నాడు. ఇక ఈ సినిమా తెలుగు లో మంచి విజయం సాధించి శ్రీకాంత్ కు మంచి లైఫ్ ఇచ్చింది. నిజానికి ఈ మూవీ మలయాళ సూపర్ హిట్టు మూవీ ‘ఇన్ హరిహరనగర్’ మూవీకి రీమేక్ అవడం విశేషం. సిద్ధిక్ లాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీలో ‘పరదా హై పరదా’ గానూ, తమిళంలో యం.జీ.ఆర్ నగర్ గానూ, కన్నడలో ‘నగరదల్లి నాయకరు’ గానూ రీమేక్ అయి ఆయా భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇక కొసమెరుపేంటంటే.. ఇన్ హరిహరనగర్ మలయాళ చిత్రానికి ఆ తర్వాత ‘2 హరిహరనగర్’ , ‘ఇన్ ఘోష్ట్ హౌస్ ఇన్’ అనే రెండు సీక్వెల్స్ తెరకెక్కాయి. అలాగే హిందీలో కూడా ‘ధోల్’ అనే మరో సీక్వెల్ కూడా రావడం విశేషం.