ఆయన విలక్షణమైన పాత్రలు పోషించడంలో దిట్ట. డైలాగుల పుట్ట. హీరో గానూ, విలన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ.. వైవిధ్యమైన మరే పాత్ర పోషణలో అయినా.. ఆయనకు ఆయనే సాటి. ఆయన పేరు మోహన్ బాబు. టాలీవుడ్ కు వైవిధ్యమైన విలనిజం నేర్పిన విలక్షణ నటుల్లో ఆయన ఒకరు. ఎన్ని సినిమాల్లో ఎన్ని పాత్రలు పోషించినా.. ఇంకా ఇంకా ఏదో కొత్తదనంతో తన పాత్రను పండించాలనే తపన పడే అరుదైన నటుల్లో మోహన్ బాబు ఒకరు. దాదాపు 44 ఏళ్ళ నటనా ప్రస్థానంలో 573 చిత్రాల్లో నటించి..72 చిత్రాలు నిర్మించి.. ఇప్పటికీ తన నటనా తృష్ణను తీర్చుకుంటున్నారు.
1952, మార్చ్ 19న చిత్తూరు జిల్లా మోదుగుల పాలెంలో జన్మించిన మోహన్ బాబు చెన్నై లో విద్యాభ్యాసం చేశారు. ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తిచేసిన ఆయన సినిమాల్లో నటించడానికి ముందు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1970 ప్రారంభంలో ఐదేళ్ళు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన ఆయన..1975 లో విడుదలైన దాసరి ‘స్వర్గం నరకం’ చిత్రంతో టాలీవుడ్ లో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు. కెరీర్ బిగినింగ్ లో తెలుగు తెరకు మోహన్ బాబు రూపంలో వైవిధ్యమైన విలన్ దొరికాడు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా అందులో విలన్ గా మోహన్ బాబే కనిపించేవారు. 1980 లో కేటుగాడు చిత్రంతో మొట్టమొదటి సారిగా మోహన్ బాబు ను యాక్షన్ హీరోను చేశారు ఆయన గురువు దాసరి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో .. మోహన్ బాబు చాలా కాలం పాటు పలు చిత్రాల్లో హీరోగా నటించి అందులో కూడా తన విలక్షణత చాటుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలం .. విలన్ వేషాలేసి.. 1990 లో విడుదలైన ‘అల్లుడు గారు’ చిత్రంతో మోహన్ బాబు మళ్లీ హీరోగా రాణించి నిలదొక్కుకున్నారు. 68ఏళ్ళ వయసులో కూడా మోహన్ బాబు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు సూర్య హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’ లో వైమానిక దళ అధికారిగా నటిస్తున్నారు. నేడు మోహన్ బాబు పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆ విలక్షణ నటుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.