సినిమా పాట సంగీత సాహిత్య సమలంకృతమైనదని, అందులోదేనిని తక్కువ చేసినా.. తనను తాను తక్కువ చేసినట్టేనని చివరి వరకూ నమ్మి.. అద్భుతమైన బాణీలతో సినీ సంగీత ప్రయాణం చేసిన సంగీత స్రష్ట ఆయన. లలిత సంగీతం పునాదుల మీద ప్రాణం పోసుకున్నదే సినీ సంగీతమని భావించే ఆయన.. తన సంగీత దర్శకత్వంలో పాడే ప్రతీ గాయకుడికి స్వాతంత్ర్యమిచ్చి .. వారిలో ఆత్మ విశ్వాసం కలుగచేసిన మహానుభావుడాయన. అంతేకాదు తన దగ్గర పనిచేసే సహాయకులకి కూడా మంచి ప్రోత్సాహమందించి .వారిచేత ఎన్నో ప్రయోగాలు చేయించిన ఘనుడాయన. ఆయన పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహాదేవన్ అనే కేవీ మహాదేవన్. దక్షిణాది సినీజనం ఆయన్ను ముద్దుగా మామ అని పిలుచుకొనేవారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 600 సినిమాలకు పైగానే వైవిధ్యమైన బాణీలందించిన కేవీ మహాదేవన్ ది సుదీర్ఘమైన సంగీత ప్రస్థానం.
ఇటు జానపద సంగీతమైనా, అటు లలిత సంగీతమైనా..లేక శాస్త్రీయ సంగీతమైనా .. ఇంకా ఏ సంగీతమైనా.. దాన్ని జన హృదయాల్లోకి చొచ్చుకొని పోయేలా చేయడంలో మామ మహాదిట్ట. తన దగ్గరకి వచ్చిన పాటకు .. సాహిత్యం బాగుంటేనే బాణీ కట్టడానికి ముందుకొచ్చేవారు మామ. అందుకే ఆయన సంగీతం అందించిన చిత్రాల్లో .. సంగీత సాహిత్యాలకు సమ ప్రధాన్యం ఉంటుంది. ఆ క్వాలిటీ వల్లనే ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్ లాంటి దర్శకులు, మురారి లాంటి నిర్మాతలు మహాదేవన్ తో పనిచేయడానికి ఉత్సాహం చూపించేవారు. మురారి అయితే.. మహాదేవన్ సంగీతం మానేసిన తర్వాత తానూ సినీ నిర్మాణాన్ని మానేశారు. మహాదేవన్ ప్రతిభకు ఎన్నో జాతీయ అవార్డులు, ప్రాంతీయ అవార్డులు వరించి తరించాయి. నేడు మహాదేవన్ జయంతి. ఈ సందర్భంగా ఆ సంగీత స్రష్టకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.