కళాత్మక దర్శకుడు మణిరత్నం చిత్రాల్లో ‘బొంబాయి’ చాలా ప్రత్యేకమైనది. అందమైన భావోద్వేగాలు కలిగిన ప్రేమకథ. మత సామరస్యం ఆవశ్యకత ఎంతైనా ఉందని చాటిచెప్పే సందేశాత్మక చిత్రం. కుల కట్టుబాట్లకు , మత మౌఢ్యానికి గొడ్డలిపెట్టు ఈ సినిమా. హ్యాండ్సమ్ హంక్ .. అరవింద స్వామి, నేపాల్ బ్యూటీ మనీషా కొయిరాలా జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సౌత్ ను ఓ రేంజ్ లో ఊపేసింది. మార్చ్ 10, 1995 న విడుదలైన ఈ సినిమా నేటితో సరిగ్గా 25ఏళ్ళు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ సినిమాలో హీరోగా విక్రమ్ ను అనుకున్నాడు మణిరత్నం. కారణాలేంటో తెలియదు కానీ .. ఆ స్థానంలోకి అరవింద్ స్వామి వచ్చాడు. ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
శేఖర్ (అరవింద్ స్వామి) ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. బాంబేలో జర్నలిజం కోర్స్ చేస్తుంటాడు. ఒకసారి సెలవులకు తన ఊరు వస్తాడు. తిరిగి బాంబే వెళ్ళేటపుడు సైరా భాను (మనీషా కొయిరాలా )అనే ముస్లిం అమ్మాయిని చూసి ఆమె మీద అనురాగం పెంచుకుంటాడు. మొదట్లో తమ కులాలు కలవవని సైరాభాను శేఖర్ ని దూరంగా ఉంచుతుంది. కానీ వాళ్ళిద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉండటం, శేఖర్ ఆమె కోసం పడే తపనను గమనించి ఆమె కూడా అతన్ని ఆరాధించడం మొదలుపెడుతుంది. శేఖర్ సైరాబాను తండ్రి బషీర్ అహ్మద్ ను కలుసుకుని అతని కూతుర్ని ప్రేమిస్తున్నాననీ, పెళ్ళి చేసుకుంటానని అడుగుతాడు. మతాల పట్టింపుతో బషీర్ అతన్ని అంగీకరించక బయటకు గెంటేస్తాడు. శేఖర్ తన తండ్రి పిళ్ళై దగ్గర అదే ప్రస్తావన తెస్తాడు. ఆయన కూడా కోపానికి గురై బషీర్ తో గొడవ పెట్టుకుంటాడు. ఆ నేపథ్యంలో ఆ ఇద్దరూ ఎలా కలిసి జీవిస్తారు? అదే సమయంలో బొంబాయిలో పేలుళ్ళు సంభవిస్తాయి. ఆ ప్రమాదం నుంచి ప్రేమికులిద్దరూఎలా బైటపడతారు? అనేదే కథ. ఏఆర్ రహమాన్ సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇది అరబిక్కడలందం, కన్నానులే కలయికలు ఏనాడు దాగవులే, ఉరికే చిలకా పాటలయితే ఎవర్ గ్రీన్ సాంగ్స్. అలాగే.. రహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బొంబాయి చిత్రానికి ప్రాణం పోసింది.