మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మెమరబుల్ సూపర్ హిట్టు మూవీ ‘కొండవీటి దొంగ’. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయలక్ష్మీ ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ పై టి. త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు , స్ర్కీన్ ప్లే అందించారు. మార్చ్ 9, 1990 న విడుదలైన ఈ సినిమా నేటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఐఏయస్ చదివి కలెక్టర్ కావాల్సిన ఒక యువకుడు.. అడవుల్లోని గిరిపుత్రులకు అండగా నిలబడతాడు. కొంతమంది స్వార్ధపరుల కబంధ హస్తాల నుంచి వారిని, వారి వనసంపదను కాపాడడానికి కొండవీటి దొంగ అవతారమెత్తుతాడు. రాధ, విజయశాంతి కథానాయికలుగా నటించగా.. శారద, శ్రీవిద్య, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అమ్రిష్ పురి, మోహన్ బాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
నిజానికి ‘కొండవీటి దొంగ’ చిత్రాన్ని శ్రీదేవి హీరోయిన్ గా తెరకెక్కించాలి. కానీ శ్రీదేవి టైటిల్ లో తన పేరు కూడా ఉండాలని, అలాగే.. తన పాత్ర నిడివి కూడా కొంచెం ఎక్కువగా వుండాలని డిమాండ్ చేయడంతో.. చిత్రం కొంతకాలం లాంచింగ్ జరగలేదు. ఆ తర్వాత విజయశాంతి హీరోయిన్ గా సినిమా తెరకెక్కి అఖండ విజయం సాధించింది. ఇక ‘కొండ వీటి దొంగ’ చిత్రానికి మేజర్ హైలైట్ ఇళయరాజా సంగీతం. శుభలేఖ రాసుకున్న , చమక్కు చమక్కుచాం, కోలో కోలమ్మగళ్ళకోకే, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, జీవితమే ఒక ఆట లాంటి పాటలన్నీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలచిపోయాయి. అలాగే.. ఆ సినిమాకి ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా జీవం పోసి.. ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకొనేలా చేస్తోంది. సో.. మెగాభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే ‘కొండవీటి దొంగ చిత్రాన్ని ఇప్పటి మెగా హీరోల్లో ఎవరితోనైనా రీమేక్ చేస్తే బాగుంటుందేమో .