Shopping Cart 0 items - $0.00 0

దొంగలొస్తున్నారు జాగ్రత్త… !

ఏపాత్ర ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అయితే ఆ సమయం వస్తే మాత్రం హీరోలందరూ ఒకే పాత్రమీద పడతారు. ప్రస్తుతం సౌత్ హీరోలు దొంగ పాత్ర మీద మక్కువ చూపిస్తున్నారు. ‘సాహో’ లో ప్రభాస్ దొంగగా కనిపించినప్పటి నుంచీ.. అదే పాత్ర ను పోషించడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో  సౌత్ స్ర్కీన్ మీద మరికొందరు హీరోలు  దొంగలుగా సందడి చేయబోతున్నారు.  

బందిపోటు దొంగ ‘విరూపాక్ష’గా పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , క్రిష్ కలయికలో పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో  ఫిక్షనల్ హిస్టారిక్ మూవీ విరూపాక్ష (వర్కింగ్ టైటిల్ ) తెరకెక్కుతోంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో ..రాబిన్ హుడ్ తరహాలో పేదల తరపున పోరాడిన బందిపోటు దొంగ గా పవర్ స్టార్ నట విశ్వరూపం ప్రదర్శించనున్నాడు. ఈ మూవీకోసం పవన్ తొలిసారిగా గుర్రమెక్కి.. కత్తి తిప్పబోతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న  ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

రామ్ దొంగగా రానున్న ‘రెడ్’

ఎనర్జిటిక్ స్టార్  రామ్ .. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి.. ఫామ్ లోకి వచ్చేశాడు. అందులో డబుల్ దిమాఖ్ పోరడిగా అదరగొట్టిన మనోడు.. ఇప్పుడు సెట్స్ మీదున్న రెడ్ మూవీలో  డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక పాత్ర దొంగ. ఖరీదైన వస్తువుల్ని  కొట్టేసి.. వాటిని ఒక ముఠాకి అమ్మేసే ఆ పాత్ర ఆసక్తి తో పాటు వినోదాన్ని కూడా బాగా పండిస్తుంది. ఆ రెండు పాత్రలు తెరమీద చేసే థ్రిల్లింగ్ యాక్టింగ్ కు అందరూ ఫిదా కావల్సిందే అంటున్నారు.

ఐటి స్కామ్ లోని  ‘మోసగాళ్ళు’ గా మంచు విష్ణు, కాజల్

హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తోన్న ‘మోసగాళ్ళు’ చిత్రం ప్రస్తుతం సౌత్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమా ఇండియాలో జరిగిన అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా తెరకెక్కింది. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో పోలీస్ పాత్రను  బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి పోషిస్తున్నాడు. ఐటి స్కామ్ లో ప్రధాన నిందుతులుగా.. మంచు విష్ణు , కాజల్ నటిస్తూండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల బృందం ఈ సినిమాకి పని చేస్తూండడం విశేషం.

‘రాజ రాజ చోర’ గా శ్రీవిష్ణు

విలక్షణమైన నటనతో , వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ.. తనదైన శైలిలో వెళుతోన్న యంగ్ హీరో శ్రీవిష్ణు. లాస్టియర్ బ్రోచేవారెవరురా మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఈ కుర్రోడు.. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘రాజ రాజ చోర’ అనే బ్లాక్ కామెడీ మూవీతో  వస్తున్నాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసే ఒక యువకుడు.. ఒకమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు సంభవించే రసవత్తరమైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఇందులో శ్రీవిష్ణు చోర శిఖామణిగా నటిస్తూండడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫష్ట్ లుక్ పోస్టర్  సోషల్ మీడియాలో భలేగా వైరల్ గా మారింది.

ఇటీవల దొంగలుగా మనసు దోచిన కార్తి, దుల్కర్ సల్మాన్

లాస్టియర్ తమిళంలో కార్తి దొంగగా నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘తంబీ’. జ్యోతిక, సత్యరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో నిఖిలా విమల్ కథానాయకగా నటించింది. జీతు జోసఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో బాగానే మార్కులు వేయంచుకుంది. ఇదే చిత్రం తెలుగులో ‘దొంగ’ గా విడుదలై. పర్వాలేదనిపించుకుంది. చిన్నప్పుడెప్పుడో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఒక యువకుడు.. దొంగగా మారతాడు. చివరికి అతడు తన కుటుంబ సభ్యులకు ఎలా దగ్గరవుతాడు అనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది.

అలాగే.. రీసెంట్ గా తమిళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లైయడిత్తాల్ ’ మూవీ సూపర్ హిట్టు టాక్ తెచ్చుకుంది. రీతూవర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా  తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ గా విడుదలైంది. ఇద్దరు చిల్లర దొంగల ప్రేమకథ గా తెరకెక్కి..ఆడియన్స్ ను భలేగా థ్రిల్ చేసింది. దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాషల్లోనూ అద్భుత విజయం సాధించింది. ఇందులో లగ్జరీ కార్స్ లోని ఖరీదైన వస్తువులు కొట్టేసి.. వాటిని అమ్ముకొని జల్సా చేసే యువకులుగా దుల్కర్, రక్షణ్ నటించి ఆడియన్స్ ను బాగా థ్రిల్ చేశారు. 

మొత్తం మీద పలువురు సౌత్ హీరోలు .. దొంగలుగా రాబోతున్నారు. మరి వీరిలో ఎంతమంది ప్రేక్షకుల మనసుల్ని ఏ రేంజ్ లో  దోచుకుంటారో చూడాలి.

 

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!