ముద్దులొలికే మోము…. చక్రాల్లాంటి కళ్ళు. కెంపులు విరబూసే చెక్కిళ్ళు.. అందమైన నవ్వు.. దివ్యమైన సౌందర్యం కలగలిస్తే ఆమె. ఇంటి పేరు అందం. అసలు పేరు దివ్యభారతి. అతి చిన్నవయసులోనే భారతీయ తెరపై తన అందంతోనూ, అభినయంతోనూ ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని అంతలోనే … దివ్యమైన లోకాలకు తరలి వెళ్ళిపోయింది. ఆమె హఠాన్మరణానికి హతాశులైన అభిమానులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. తొంభైల్లో టాలీవుడ్ లోకి కథానాయికగా అడుగుపెట్టిన ఆమె .. అప్పట్లో అగ్ర కథానాయకులందరి సరసనా నటించి తన గ్లామర్ తో అబ్బుర పరిచింది .
1990లో వెంకటేశ్ బొబ్బిలిరాజా చిత్రంతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతి.. వస్తూ వస్తూ.. గ్లామర్ ను కూడా తన వెంటే తీసుకొచ్చింది. తొలి చిత్రంలోనే క్రేజీ హీరోయిన్ అయి పోయిన అమ్మడు ..ఆ తర్వాత ‘రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, ధర్మ క్షేత్రం , చిట్టెమ్మ మొగుడు’ లాంటి చిత్రాలతో .. టాలీవుడ్ లో అప్పటి అగ్ర కథానాయికలకు సవాల్ విసిరింది దివ్యభారతి. ఆపై హిందీలోనూ తన అందాల విశ్వరూపాన్ని ప్రదర్శించి.. అక్కడ కూడా క్రేజీ గాళ్ అయిపోయింది. హిందీ నిర్మాత సాజిద్ నడియా వాలాను పెళ్ళిచేసుకొని.. టాలీవుడ్ లో మరిన్ని టాప్ మోస్ట్ ప్రాజెక్ట్స్ ను కైవసం చేసుకొన్న ఆమె .. అంతలోనే హఠాన్మరణానికి గురైంది. ఆమె లేని లోటు ఇప్పటికీ టాలీవుడ్ కు స్పష్టంగా కనిపిస్తోంది. నేడు ఆమె జయంతి . ఈ సందర్భంగా దివ్యభారతికి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.