ఆల్రెడీ ఒకసారి డబ్బింగ్ రూపంలో కానీ,  రీమేక్ రూపంలో కానీ విడుదలై వెళ్ళిపోయిన చిత్రాలనే , వేరే హీరోతో .. వేరే ఫ్లావర్ తో మరోసారి తెరకెక్కించి క్యాష్ చేసు కోవాలనుకోవడాన్ని ఏమంటారు? ఆ మధ్య వపర్ స్టార్ ‘కాటమరాయుడు’ మూవీ విషయంలోనూ  అదే జరిగింది.   ‘వీరం’ గా తమిళంలోంచి ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో డబ్ అయిన  సినిమా ఇక్కడ బాగానే ఆడింది. అయినా సరే మళ్ళీ అదే చిత్రాన్ని పవర్ స్టార్ తో ‘కాటమరాయుడు’గా తెరకెక్కించి చేదు అనుభవాన్ని చవిచూశాడు దర్శకుడు డాలీ.  కాకపోతే అది అఫీషియల్ రీమేక్.

కానీ ప్రస్తుతం రవితేజ తో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ‘క్రాక్’ మూవీ తమిళ ‘సేతుపతి’ చిత్రానికి అనఫీషియల్ రీమేక్ .. అదేనండీ.. ఫ్రీమేక్ అని తెలుస్తోంది. విజయ్ సేతు పతి పోలీస్ అవతారంలో విజృంభించిన ఆ సినిమా అక్కడ  సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత అదే చిత్రాన్ని గంటా శ్రీనివాసరావు వారసుడు గంటా రవితేజ హీరోగా ‘జయదేవ్’ గా తెరకెక్కించాడు జయంత్ సి పరాన్జీ . కానీ ఆ సినిమా ఇక్కడ ఘోర పరాజయం పాలయింది. విజయ్ సేతుపతి లాంటి హీరో చేసిన ఆ సినిమాను తెలుగులో కూడా రవితేజ లాంటి పవర్ ఫుల్ హీరో చేసుంటే.. ఆ సినిమా పరిస్థితి వేరేలా ఉండేదని అప్పట్లో ‘జయదేవ్’ చిత్రం మీద విమర్శలొచ్చాయి. అందుకేనేమో రమేశ్ వర్మ అంత ధైర్యంగా రవితేజ తో అదే చిత్రాన్ని ఫ్రీమేక్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన ‘క్రాక్’ టీజర్ ను చూస్తే .. ఆ సంగతి అర్ధమవుతుంది. సేతుపతి స్టోరీ లైన్ నే తీసుకొని రమేశ్ వర్మ తనదైన స్టైల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. మరి మే 8న విడుదల కానున్న మరో ‘సేతుపతి’ లాంటి ‘క్రాక్’ మూవీ ఈసారి  ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!