మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాదిరాళ్ళు’ కు దర్శకత్వం వహించిన గుడిపాటి రాజ్ కుమార్ ఈ శనివారం హైద్రాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కూడా పునాది రాళ్ళే తొలి చిత్రం . మొదటి సినిమాతోనే ఐదు నంది అవార్డులు కైవసం చేసుకొని టాలీవుడ్ లో సెవెంటీస్ లోనే చరిత్ర సృష్టించిన ఆయన .. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే చిరంజీవి ఆయన్ను అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసి.. వైద్యపరీక్షలు చేయించారు.
ఆమధ్య ఆయన పెద్ద కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్యకూడా కన్నుమూయడం ఆయన్ను తీవ్రంగా కలచివేశాయి. గత కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తోన్న ఆయన అద్దె ఇంట్లోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఈ శనివారం మరణించిన ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం ఉయ్యూరు తీసుకువెళ్లేందుకు చిన్నకొడుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మృతికి పలు టాలీవుడ్ నటీనటులు తమ సంతాపం తెలియచేశారు.