ఆయన స్వరం షడ్జమం

రాగం రిషభం

గానం గాంధారం

మాధుర్యం మధ్యమం

పాట పంచమం

ధ్వని దైవతం

నాదం నిషాదం

సప్తస్వర సమ్మిళతమైన ఆ గానరస పానశాల ఘంటసాల.

బాపు, రమణల మాటల్లో చెప్పాలంటే.. గీతాలకు ముందు ఉపోద్ఘాతాలు.. రాగాల్లో భావోద్వేగాలు.. స్వరాలతో నిత్యఖేల.. గొంతు కంచు ఘంటలీల.. అసలు పేరు గానలోల .. మారుపేరు ఘంటసాల. తేట తేట తెలుగులా..  తెల్లవారి వెలుగులా.. తేరు లా .. సెలయేరులా..కలకల.. గలగల పొంగి పొరలింది తెలుగునాట ఆయన స్వరం గంగా ప్రవాహంలా.

తెలుగు చిత్రవైభవాన్ని దశదిశలా చాటిన ఘనులు యన్టీఆర్, ఏయన్నార్. ఈ ఇద్దరు మహానటుల అభినయానికి ఘంటసాల గానమే జీవం పోసింది. ఆ మహానటులిద్దరి నటజీవితాల్లోని గానసామ్రాజ్యాలు సైతం ఘంటసాల గానంతోనే తడిసిపోయాయి. తెలుగునేల చేసుకున్న పుణ్యఫలాన వెలసిన ఎన్నో అద్భుత చిత్రరాజాలకు ఘంటసాల గళమే ఓ ఆభరణమయింది. తెలుగు పలుకు ఉన్నంత వరకు తెలుగు వెలుగు ప్రసరిస్తున్నంత కాలం ఘంటసాల గానమాధుర్యం సాగుతూనే ఉంటుంది.

సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో ఘంటసాలకు లలితగీతాల గాయ కుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు. ఘంటసాల చేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తురు నాగయ్య, బి.ఎన్‌.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆ పాటకు ఆయనకు 116 రూపాయల పారితోషకం లభించింది. తర్వాత ‘బాలరాజు, మనదేశం’ లాంటి హిట్‌ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు. 1951లో ‘పాతాళభైరవి’ విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారు మోగింది. తరువాత విడుదలయిన ‘మల్లీశ్వరి’ చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి ఘంటసాల గాత్రం తొడై రసానందం తారస్థాయికి చేరింది. 1953లో వచ్చిన ‘దేవదాసు’ ఘంటసాల సినీ జీవితంలో మరో మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో నా నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ చెపుతుంటారు. 1955లో విడుదలయిన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని ‘శేష శైలవాస శ్రీ వేంకటేశ’ పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడినదే! ఏ నోట విన్నా ఆయన పాడిన పాటలే. 1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. నేడు ఘంటసాల వర్ధంతి. ఆ అమరగాయకుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!