Remake of the Day : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ యన్టీఆర్ నట జీవితంలో అపురూపమైన చిత్రంగా చెప్పుకోదగ్గది ‘గుడిగంటలు’. 1964లో రాజ్యలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రానికి వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు. కృష్ణ కుమారి కథానాయికగా నటించగా.. జగ్గయ్య, మిక్కిలినేని, నాగయ్య, వాసంతి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1964 వ సంవత్సరానికి గాను ఈ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అవార్డు ప్రకటించింది. అప్పట్లో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.
నిజానికి ఈ సినిమా శివాజీగణేశ్, యస్.యస్. రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సూపర్ హిట్ ‘ఆలయమణి’ కి రీమేక్ వెర్షన్. ఘంటసాల సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సంగీత ప్రియుల్ని ఓలలాడించాయి. ముఖ్యంగా ‘జన్మమెత్తితిరా, నీలికన్నుల నీడలలోన, నీలోన నన్నే నిలిపావు నేడే పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్. నెగెటివ్ షెడ్స్ తో, ఒక సైకిక్ స్వభావం కలిగిన పాత్రలో యన్టీఆర్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో అద్భుతంగా నటించారు.