Raviteja : 2022లో ‘ధమాకా’తో మాస్ మహారాజా రవితేజ ఘన విజయం సాధించిన తర్వాత.. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా రవితేజ కెరీర్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో రవితేజ తన పారితోషకంలో కొంత భాగాన్ని వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది.
రవితేజ కెరీర్ ఎల్లప్పుడూ ఒడిదుడుకులకు గురవుతూనే ఉంది. ఒకప్పుడు ఒకటి రెండు ఫ్లాపులు వచ్చినా, వెంటనే హిట్ కొట్టేవారు. కానీ ఇప్పుడు హిట్టుకి హిట్టుకి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. ఇది రవితేజ అభిమానులను కలవరపెడుతున్న విషయం. ఈ పరిస్థితుల్లో రవితేజ కెరీర్‌ను నిలబెట్టే బాధ్యత భాను భోగవరపు అనే కొత్త దర్శకుడి మీద పడింది. భాను, రవితేజతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది.
రవితేజ ఈ సినిమాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రవితేజ మార్కు మాస్ ఎంటర్టైనర్‌గా ఉంటూనే కొత్తదనం పంచుతుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ కెరీర్ తిరిగి పుంజుకోవాలంటే, ఆయన కొత్త కథలు, కొత్త దర్శకులతో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా, ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకుని, వారిని ఆకట్టుకునేలా సినిమాలు ఎంచుకోవాలి.