Sarva 38 : తన కెరీర్‌లో అనేక విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్న యంగ్ హీరో శర్వానంద్ తన 38వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు రొమాంటిక్ హీరోగా, క్లాసిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మనకు పరిచయమైన శర్వా, ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన మాస్ ఇమేజ్‌లో కనిపించనున్నాడు.

1960ల దశకంలోని ఉత్తర తెలంగాణా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని నేపథ్యంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా, ఆ కాలానికి తగినట్లుగా ఓ కొత్త లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ చరణ్, రవితేజ, గోపిచంద్ లాంటి స్టార్ హీరోలతో అనేక మాస్ ఎంటర్టైనర్స్‌ను అందించిన సంపత్ నంది, శర్వాతో కలిసి ఈసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే లక్ష్యంతో దర్శకుడు సంపత్ నంది చాలా కాలంగా ఈ కథపై పని చేస్తున్నాడు. సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతర ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Leave a comment

error: Content is protected !!