Remake of the Day : నటభూషణ శోభన్ బాబు హీరోగా నటించిన హార్ట్ టచింగ్ మూవీ ‘సన్నాయి అప్పన్న’ . సన్నాయి విద్వాంసుడిగా శోభన్ బాబు అద్భుతంగా నటించారు. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రమణచిత్ర బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంది. జయప్రద హీరోయిన్ గా నటించగా.. ఈశ్వరరావు, సంగీత, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, సాక్షిరంగారావు, కైకాల సత్యనారాయణ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. జీకే వెంకటేశ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ఆడియన్స్ ను ఎంతగానో అలరించాయి.
నిజానికి ఈ సినిమా రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘సనాది అప్పణ్ణ’ సూపర్ హిట్ కన్నడ మూవీకి రీమేక్ వెర్షన్. విజయ్ దీనికి దర్శకుడు. కృష్ణమూర్తి పురాణిక్ రాసిన ‘కునియితు హెజ్జె నలియితు గెజ్జే అనే సుప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కింది. జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా ఒక పాటలో కనిపిస్తాడు. రాజ్ కుమార్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. తెలుగు వెర్షన్ సన్నాయి అప్పన్న కూడా ఇంతే రేంజ్ లో మంచి వసూళ్ళు సాధించడం విశేషం.