దర్శకధీరుడు రాజమౌళి యన్టీఆర్, రామ్ చరణ్ తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా రోజుకో ఆసక్తికరమైన అప్టేడ్ తో అభిమానుల్ని ఊరిస్తోంది. ఇందులో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు కోకొల్లలు. అలాంటి వాటిలో సినిమా ప్రారంభంలో వచ్చే యన్టీఆర్, తోడేలు పోరాట సన్నివేశం ఒక మచ్చుతునక అంటున్నారు. ఇక ఇందులో తారక్ కొమ్రం భీమ్ పాత్రలో నటిస్తోంటే.. చెర్రీ అల్లూరి సీతారామరాజు గా అభినయిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట.
ఇదిలా ఉంటే.. జక్కన్న సన్నిహితుల్ని నుంచి వచ్చిన మరో సరికొత్త అప్డేట్ ఏంటంటే.. రామ్ చరణ్ బ్రిటీష్ ఇండియా కాప్ గా ఒక ఐదు నిమిషాలు కనిపిస్తాడట. ఆ సన్నివేశం త్వరలోనే చిత్రీకరణ జరుపుకోనుందట. రామ్ చరణ్ పోలీస్ యూనిఫామ్ ధరించిన ఆ కాస్త సేపూ ప్రేక్షకుల్లో తెగ ఆవేశం రగలిపోతుందని సమాచారం. ఇటీవల అజయ్ దేవ్ గణ్, యన్టీఆర్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరించారట. చెర్రీతో అజయ్ పోర్షన్ కూడా త్వరలోనే చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాదే విడుదల కానున్న ఈ మూవీ తారక్ , చెర్రీలకు ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.