Remake of the Day : లోకనాయకుడు కమల్ హాసన్ తన కెరీర్ బిగినింగ్ లో నటించిన అద్భుత చిత్రం ‘ఇది కథకాదు’. కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1979 లో విడుదలైంది. జయసుధ, శరత్ బాబు, లీలావతి, సరిత ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో కీలకమైన విలన్ పాత్రను మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా పోషించి రక్తి కట్టించారు. జయసుధ భర్తగా ఒక శాడిస్టిక్ పాత్రలో చిరంజీవి నటన అమోఘం. ఈ సినిమా రిలీజైన నాటికి కలర్ సినిమాలు వస్తునప్పటికీ.. దర్శకుడు బాలచందర్ ఈ సినిమాను మాత్రం బ్లాక్ అండ్ వైట్ లోనే చిత్రీకరించడం విశేషం. ఇందులోని సుహాసిని అనే పాత్రను అత్యంత సహజంగా పోషించిన జయసుధను ఉత్తమ నటిగా ఆ ఏడాది నంది అవార్డు వరించింది.
నిజానికి ఇదికథ కాదు చిత్రం బాలచందర్ దర్శకత్వంలోనే తమిళంలో సూపర్ హిట్టైన ‘అవర్ గళ్’ చిత్రానికి రీమేక్ వెర్షన్. 1977లో రిలీజైన ఈ సినిమాలో సుజాత, కమల్ హాసన్, లీలావతి , రవికుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో జయసుధ భర్తగా రజనీకాంత్ నటించడం విశేషం. ఆ పాత్రనే తెలుగులో చిరంజీవి నటించి మెప్పించారు. తమిళ, తెలుగు వెర్షన్స్ రెండింటికీ యం.యస్ విశ్వనాథనే సంగీతం అందించారు. ముఖ్యంగా కమల్ హాసన్ వెంట్రిలాక్విజం సాంగ్ రెండు వెర్షన్ లోనూ సూపర్ హిట్టైంది.