Colcutta Incident : కోల్ కత్తాలో జరిగిన దారుణ ఘటనకు తెలుగు సినీ ప్రముఖులు బాధితురాలి కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్, నిర్మాత ఎస్ కె యెన్, జీవిత రాజశేఖర్, హీరోయిన్ కామాక్షి భాస్కరాల, అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.
రైటర్ అసోసియేషన్ సెక్రెటరీ ఏ యెన్ రాధా మాట్లాడుతూ, ఇవాళ సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే, స్త్రీలకు సమాంతర గౌరవం దొరకట్లేదనిపిస్తుందని వ్యాఖ్యానించారు. స్త్రీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రభుత్వం వైపు చూడకుండా, మన సంస్థల్లో, మన చుట్టుపక్కల స్త్రీలను ఎలా రక్షించాలనే దానిపై ఆలోచించాలని కోరారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, జరిగిన సంఘటన చాలా బాధాకరం అని, ప్రభుత్వాన్ని నిందించడానికి ముందు మనం మన పిల్లలను ఎలా పెంచుతున్నామో ఆలోచించాలని అన్నారు. అన్ని యూనియన్లలో వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, చలన చిత్ర పరిశ్రమలో మహిళలకు గౌరవం ఉందని, అయినప్పటికీ ఆడపిల్లల గురించి ఆలోచిస్తుంటే బాధేస్తుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, చుట్టుపక్కల ఎవరైనా సరిగా ప్రవర్తించకపోతే వెంటనే ఇంట్లో వారితో మాట్లాడాలని సూచించారు.
వీర శంకర్ మాట్లాడుతూ, కోల్కత్తాలోని మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం దానిపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రధానమంత్రి, సిబిఐకి మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై లేఖలు మరియు ఇమెయిల్‌లు రాయాలని పిలుపునిచ్చారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాదాల రవి మాట్లాడుతూ, అసోసియేషన్‌లోని మహిళల భద్రత కోసం ‘విమెన్ సెక్యూరిటీ సెల్’ స్థాపించామని తెలిపారు. నటి కామాక్షి మాట్లాడుతూ, మహిళలపై జరిగే హింసకు మహిళల వస్త్రధారణ కారణమని ఆరోపించడం ఆపాలని కోరారు. మహిళలపై అసభ్యకర మాటలు, చర్యలు ఆపి మెరుగైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ మాట్లాడుతూ, ఈ ఈవెంట్‌కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.