Rana Daggubati : టాలీవుడ్‌లోని టాల్ హ్యాండ్ సమ్ రానా దగ్గుబాటి తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘బాహుబలి’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించిన రానా, కొద్ది కాలంగా సినిమాల్లో కనిపించకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. రానా ఆఖరు సినిమా విరాటపర్వం. అయితే, త్వరలోనే తెరపై కొత్త ఇమేజ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రానా.

తాజా సమాచారం ప్రకారం, రానా కిషోర్ అనే కొత్త దర్శకుడితో కలిసి పని చేయబోతున్నాడు. ఈ సినిమా హారర్‌కు సంబంధించిన అంశాలతో ఉంటుందని తెలుస్తోంది. విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ఈ సంస్థ చిన్న సినిమాలపై దృష్టి సారించింది. అయితే, రానాతో కలిసి పెద్ద బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాలని నిర్మాతలు నిర్ణయించారు. రానా పాన్ ఇండియా స్టార్ కాబట్టి, ఈ సినిమా కూడా దేశవ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

రానా ప్రస్తుతం ‘రానా నాయుడు-2’ వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మొదటి సీజన్‌కు వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ఈ సీజన్‌లో కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. రానా బాబాయి వెంకటేష్ కూడా ఈ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

గత కొన్ని సంవత్సరాలుగా రానా సినిమాల్లో కనిపించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొత్త కథల కోసం వెతుకుతున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాలనే ఆలోచనలో ఉన్నాడు వంటి విషయాలు వార్తల్లో వినిపించాయి. అయితే, తాజాగా కొత్త సినిమాలతో అతను తిరిగి ఫామ్‌లోకి వస్తున్నాడు.

Leave a comment

error: Content is protected !!