R.Narayanamurthy : ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి స్వల్ప అస్వస్థతకు గురై, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందగా, మూర్తి తన ఆరోగ్యం గురించి స్పందిస్తూ, తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.
రెండు నెలల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్న మూర్తి, తాజాగా కొంచెం నీరసం నెలకొనడంతో ప్రసాద్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం, మరింత స్పష్టత కోసం నిమ్స్‌కు వెళ్లి, అక్కడ జనరల్ టెస్ట్‌లు చేయించుకున్నారు.
డైరెక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలు సాధారణంగానే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే, సోషల్ మీడియాలో మూర్తి ఆరోగ్యం గురించి అనేక రకాల దుష్ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. వీటిని మూర్తి ఖండించారు.
“నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుడి దయతో నేను కోలుకుంటున్నాను. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను” అని మూర్తి తెలిపారు.
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో విప్లవాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మూర్తి, ఇటీవలి కాలంలో కొన్ని వైఫల్యాలను ఎదుర్కొన్నారు. చిన్న సినిమాల మనుగడ కోసం నిరంతరం గొంతు ఎత్తుతున్న మూర్తి, తన సినిమాలకు థియేటర్లు దొరకకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరగా “కానిస్టేబుల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూర్తి, తన తదుపరి సినిమా గురించి త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.